తెలంగాణ యూనివర్సిటీలో వీసీ, ఈసీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. వీసీ, ఈసీ పోటాపోటీగా రిజిస్ట్రార్లను నియమించడంతో వర్సిటీ పరువు బజారున పడింది.
నిజామాబాద్, వెలుగు :
నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీలో ఇటీవలి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వీసీ రవీందర్‌గుప్తాకు, ఈసీ(పాలక మండలి)కి మధ్య వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. వీసీ రవీందర్‌గుప్తాకు వ్యతిరేకంగా మెజారిటీ ఈసీ సభ్యులు ఏకం కావడం, వారికి ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ అండగా నిలవడం, ఇరువర్గాలు పోటాపోటీగా రిజిస్ట్రార్లను నియమించడంతో యూనివర్సిటీ పరువు బజారున పడింది. వీసీ అపాయింట్ చేసిన విద్యావర్ధినికి రిజిస్ట్రార్‌గా కొనసాగే అర్హత లేదంటూ పాలకమండలి యాదగిరిని నియమించగా, వీసీ రవీందర్ గుప్తా హైకోర్టు నుంచి స్టే పొందారు. కోర్టు ఆర్డర్ వచ్చేదాకా ఈసీ నిర్ణయం ప్రకారం యాదగిరి రిజిస్ట్రార్‌గా వారం పాటు పని చేశారు. ఇంతలో వీసీ రవీందర్‌గుప్తా ఓయూ ప్రొఫెసర్ నిర్మలాదేవిని ఆ పోస్టులో నియమించారు. ఓ వైపు ఆమె ఆ పదవిలో ఉండగానే, సోమవారం ఉదయం అకస్మాత్తుగా యాదగిరి వచ్చి రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోవడం కలకలం రేపింది. ఐదుగురు ఈసీ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన సీటులో కూర్చొని రిజిస్ట్రార్ హోదాలో ఫైళ్లు చూశారు. మరోవైపు తానే రిజిస్ట్రార్నంటూ నాలుగు రోజుల కింద చార్జి తీసుకున్న నిర్మలాదేవి చివరకు హైదరాబాద్ స్థాయిలో జరిగిన హైడ్రామా తర్వాత ఓయూలోని ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్‌గా (పూర్వస్థానంలో) జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు.
జరిగింది ఇదే..
వీసీ రవీందర్ గుప్తా ఈసీ మీటింగ్ పెట్టకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, అడ్డదారుల్లో ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపిస్తూ మెజారిటీ ఈసీ మెంబర్లు ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ యూనివర్సిటీలో వివాదం మొదలైంది. దీంతో నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో ఏప్రిల్19న హైదరాబాద్‌లో ఈసీ మీటింగ్ నిర్వహించగా, వీసీ రవీందర్ గుప్తా, ఆయన నియమించిన రిజిస్ట్రార్ విద్యావర్ధిని, ఈసీ మెంబర్లు వచ్చారు. విద్యావర్ధినిని రిజిస్ట్రార్‌గా వీసీ పరిచయం చేయగా, వెంటనే మీటింగ్ నుంచి వెళ్లిపోవాలంటూ నవీన్ మిట్టల్ ఆదేశించారు.
విద్యావర్ధిని వెళ్లిపోగా, వీసీ సైతం మీటింగ్‌ను బాయ్‌కాట్ చేశారు. దీంతో వాకాటి కరుణ అధ్యక్షతన ఈసీ మీటింగ్ జరిపి, తెలంగాణ వర్సిటీ ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నియామకంపై వీసీ రవీందర్ గుప్తా హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. ఈలోగా 26న హైదరాబాద్‌లో మరోసారి సమావేశమైన ఈసీ.. వర్సిటీలో ఈసీ ఆమోదం లేకుండా చేసిన ఖర్చులు, ఇచ్చిన ప్రమోషన్లు, ఔట్ సోర్సింగ్ అపాయింట్మెంట్లు 2022–-23, 2023-–24 బడ్జెట్ రూపకల్పన తదితర విషయాలపై విచారణ కోరుతూ విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ డీజీలకు లెటర్ రాశారు. ఈలోగా వర్సిటీ రిజిస్ట్రార్‌గా వీసీ రవీందర్‌గుప్తా ఉస్మానియా ప్రొఫెసర్ నిర్మలాదేవిని అపాయింట్ చేశారు. మే 3న నిర్మలాదేవిని చార్జి తీసుకున్నారు. మే 5న హైదరాబాద్‌లో మరోసారి సమావేశమైన ఈసీ.. యాదగిరిని కంటిన్యూ చేస్తున్నట్లు మినిట్స్ రాసి, రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. 6న యాదగిరి వస్తారని భావిస్తున్న తరుణంలో అంతకన్నా ముందు ఉదయం 9గంటలకే రిజిస్ట్రార్ కుర్చీలో నిర్మలాదేవి కూర్చున్నారు. అదే రోజు ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్స్ జీతాల చెక్కుపై సంతకం చేసి వెళ్లారు. సోమవారం కూడా ఆమె వస్తారని భావించగా, అంతకంటే ముందే యాదగిరి వచ్చి కూర్చున్నారు.
ఆధిపత్యపోరుతో ఆగిపోయిన జీతాలు
ఈసీ, వీసీ ఆధిపత్య పోరుతో బ్యాంకర్లకు తిప్పలు వచ్చి పడ్డాయి. వర్సిటీ ఫైనాన్స్ వ్యవహారాలు రిజిస్ట్రార్ చూస్తారు. ఉద్యోగుల జీతాలు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇచ్చే బాధ్యత ఆ చైర్దే. 1వ తారీఖు దాటిపోయినా జీతాలు లేవని 276 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. నగదు డ్రా చేయడానికి ఒక వైపు నిర్మలాదేవి మరో పక్క యాదగిరి చెక్కులు పంపడంతో బ్యాంకర్స్ కన్ఫ్యూజన్లో పడ్డారు. ఎవరి చెక్కును ఓకే చేయాలో తెలియక తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. యాదగిరే రిజిస్ట్రార్ అని గవర్నమెంటు నుంచి సోమవారం మెయిల్ వచ్చినా బ్యాంకర్లలో అనుమానాలు పోలేదు. విషయాన్ని తమ పైస్థాయి అధికారులకు చేరవేశారు.
హైదరాబాద్ స్థాయిలో చక్రం..
వర్సిటీలో నెలకొన్న వివాదాలు తెలిసి కూడా నిర్మలాదేవి రిజిస్ట్రార్‌గా చార్జి తీసుకోవడం, ఈసీలో భాగస్వామ్యులైన పెద్దాఫీసర్లకు చికాకు తెప్పించింది. తమ అనుమతి లేకుండా ఈసీ మీటింగ్‌కు వెళ్లారని వర్సిటీలోని ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌కు రెండు రోజుల గడువుతో క్రమశిక్షణ నోటీసులు సర్వ్ చేయడంతో వారికి మరింత ఆగ్రహం కలిగించింది. దీంతో హైదరాబాద్ స్థాయిలో నిర్మలాదేవికి చెక్ పెట్టినట్లు భావిస్తున్నారు. వీసీ రవీందర్ అవినీతిని ఆపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో వేలుపెట్టడమంటే మున్ముందు సర్వీసును ఇబ్బందుల్లోకి నెట్టుకోవడమే అవుతుందని ఆమెను హెచ్చరించడం వల్లే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మలాదేవి సోమవారం ఓయూలో (పూర్వస్థానంలో) జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా? ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తిరేపుతోంది.