- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి ఫైనాన్స్బాధ్యతలు
- అప్పగించిన హైకోర్టు అలర్టయి ఆర్డర్స్ ఇచ్చిన
- వీసీ రవీందర్‌గుప్తా తెలంగాణ యూనివర్సిటీలో కీలక పరిణామం
నిజామాబాద్/డిచ్పల్లి, వెలుగు : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వర్సిటీ రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమిస్తూ వీసీ రవీందర్‌గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రార్ విషయంలో 2 నెలలుగా ఈసీ, వీసీ మధ్య జరుగుతున్న ఫైట్‌కి వీసీ తాజా ఉత్తర్వులతో తాత్కాలిక బ్రేక్ వేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు ఈ నెల 26వ తేదీ వరకు ఫైనాన్స్ బాధ్యతలు అప్పగిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అలర్టయిన వీసీ..ఈసీ ఆమోదించిన యాదగిరినే రిజిస్ట్రార్ గా నియమించారు.
తెలివిగా ఆర్డర్స్ ఇచ్చిన వీసీ
ఏప్రిల్19 నాటి ఈసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వీసీ రవీందర్ గుప్తా హైకోర్టుకు వెళ్లగా న్యాయస్థానం స్టే ఇచ్చింది. తర్వాత మరో పిటిషన్ వేయగా సర్కారు కౌంటర్ ఫైల్ చేసింది. గురువారం వాదనలు కొనసాగుతుండగా తుది నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది. అప్పటిదాకా వర్సిటీలో రోజువారీ ఫైనాన్స్ వ్యవహారాలు ప్రభావితం కాకుండా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు బాధ్యతలు అప్పగించింది. దీంతో వీసీ రవీందర్ గుప్తా శుక్రవారం వర్సిటీకి వచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిపాలన భవనానికి వెళ్లకుండా నేరుగా క్యాంపస్‌లోని తన ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రిజిస్ట్రార్‌గా యాదగిరిని అపాయింట్ చేస్తున్నట్లు ఉత్తర్వులు రెడీ చేసి, మరో ప్రొఫెసర్‌తో యాదగిరికి పంపించారు. రిజిస్ట్రార్‌గా ఆయన 6 నెలలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు (ఏది ముందైతే అది) కొనసాగుతారని ఆర్డర్స్ ఇచ్చి హైదరాబాద్వెళ్లిపోయారు. మరో ఆర్డర్ ఎప్పుడు జారీ చేసినా యాదగిరి కుర్చీ దిగిపోయేలా తెలివిగా నిర్ణయాన్ని తీసుకున్నారు.
జీతాల సమస్య పరిష్కారమైనట్టేనా?
తనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వీసీ రవీందర్ జారీ చేసిన ఆర్డర్స్ చూసిన యాదగిరి వెంటనే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను ఫోన్లో సంప్రదించారు. మరికొందరు ఈసీ సభ్యులతో కూడా చర్చించి రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వచ్చారు. జీతాల కోసం నాన్‌టీచింగ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుండడంతో వాకాటి కరుణ తనకు కోర్టు ద్వారా లభించిన ఫైన్సాన్స్పవర్స్ను యాదగిరికి బదలాయించే లెటర్‌ను పంపించనున్నట్టు తెలిసింది. దీని ద్వారా ఆయన జీతాలు చెల్లించే అవకాశం ఉంది. వీసీ రవీందర్గుప్తాపై కూడా జీతాల చెల్లింపు ఒత్తిడి ఉండడంతో ప్రస్తుత పరిస్థితులను ఓవర్టేక్ చేయడానికే ఆయన యాదగిరి పక్షంగా ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్‌లో శనివారం జరగనున్న ఈసీ మీటింగ్‌కు హాజరవుతానని వీసీ రవీందర్‌గుప్తా తెలిపారు.
