బాలీవుడ్ మెహందీ క్వీన్ ఎవరో తెలుసా ?

బాలీవుడ్ మెహందీ క్వీన్ ఎవరో తెలుసా ?

ఇప్పుడు బీ-టౌన్​ నుంచి టీ టౌన్​ దాకా బాలీవుడ్​ స్టార్స్​ విక్కీ కౌశల్​, కత్రినా కైఫ్​ పెళ్లి వేడుక గురించే మాట్లాడుకుంటున్నారు. రాజస్తాన్​లోని బర్వారా కోటలో ఉన్న ‘సిక్స్​ సెన్సెస్’ రిసార్ట్​లో వీళ్ల పెళ్లి జరగనుంది. మెహందీ ఫంక్షన్​తో పెండ్లి తంతు మొదలవుతుంది. పెండ్లికూతురు కత్రినా కైఫ్​కి మెహందీ పెట్టేందుకు వెళ్లింది ఎవరో తెలుసా?... సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్​ వీణ నగ్డా. దాదాపు 30 ఏండ్లుగా మెహందీ ఆర్టిస్ట్​గా ఉన్న నగ్డాకి ‘బాలీవుడ్​ మెహందీ క్వీన్​’ అని పేరుంది.

‘బిగ్​ ఫ్యాట్​ వెడ్డింగ్స్’ నుంచి చాలామంది బాలీవుడ్​ స్టార్స్​ పెండ్లి వేడుకల్లో మెహందీ పెట్టింది నగ్డా. పెండ్లిండ్లు అనేకాదు... పండుగ,  కమర్షియల్​ యాడ్స్​ లేదంటే సినిమా షూటింగ్... ఫంక్షన్​ ఏదైనా సరే మెహందీ అనగానే బాలీవుడ్​ సెలబ్రిటీలకి ముందుగా గుర్తొచ్చేది నగ్డానే. డెస్టినేషన్​ వెడ్డింగ్​ అయినా కూడా ఆమెతో మెహందీపెట్టించుకునేందుకు ఇష్టడపతారు బాలీవుడ్​ బ్యూటీలు. అందుకే.. మూడేండ్ల క్రితం దీపిక పదుకోన్​కి మెహందీ వేయడానికి ఇటలీకి వెళ్లింది. అంతేకాదు  వరుణ్​ ధావన్​, నటాషా దలాల్​ల పెండ్లిలో, సోనమ్​ కపూర్​కి మెహందీ వేసింది తనే. పెండ్లి కూతురికి మెహందీ పెట్టడమే కాకుండా నెయిల్​ పాలిష్​, బ్లాక్​ మెహందీ, స్టోన్​ లేదా డైమండ్​ మెహందీవేయడంలో స్పెషలిస్ట్​ కూడా​. తనకి వచ్చిన ఆర్ట్​ని ఇంట్రెస్ట్​ ఉన్నవాళ్లకి నేర్పిస్తుంది కూడా. ఇప్పటి వరకూ మెహందీ డిజైనింగ్​లో 
50 వేలమంది స్టూడెంట్స్​కి ట్రైనింగ్​ ఇచ్చింది. 

బాలీవుడ్​కి వచ్చిందిలా
బాలీవుడ్​ డైరెక్టర్​ ఫరా​ ఖాన్​ తన పెండ్లికి నగ్డాతో మెహందీ పెట్టించుకుంది. నగ్దా మెహందీఆర్ట్​ గురించి తెలుసుకున్న డైరెక్టర్లు ఆమెని తమ సినిమాల్లో మెహందీ పెట్టేందుకు పిలిచేవాళ్లు.  అలా ఇప్పటివరకూ ‘కభీ ఖుషీ కభీ గమ్​’, ‘కల్​ హో నహో’, ‘పాటియాల హౌస్​’, ‘ఏ జవానీ హై దీవానీ’ వంటి సినిమాల్లో హీరోయిన్లకి మెహందీ పెట్టింది నగ్డా. అంతేకాదు‘ఏ దిల్​ హై ముష్కిల్​’ సినిమాలోని ‘చెన్నా మేరేయా’ పాటలో రణ్​బీర్​ కపూర్​కి మెహందీ పెట్టింది కూడా తనే. బాలీవుడ్​లో ఆమె మెహందీ ఆర్ట్​కి బోల్డెంతమంది ఫ్యాన్స్​ ఉన్నారు. డింపుల్​ కపాడియా, మాధురి దీక్షిత్​, శిల్పా షెట్టిల నుంచి ఈతరం హీరోయిన్లు అనన్యా పాండే నుంచి అలియా భట్​ వరకు అందరూ వీణ దగ్గర మెహందీ పెట్టించుకున్నవాళ్లే. 
పార్టీలు, ఫంక్షన్లతో మొదలు
“మాది ముంబై. మిడిల్​ క్లాస్ జైన్​​ కుటుంబంలో పుట్టాను. టెన్త్​ క్లాస్​ ఫస్ట్​క్లాస్​లో పాస్​ అయినా కూడా మావాళ్లు నన్ను చదివించలేదు. దాంతో ఇంట్లో ఉంటూనే చీరల మీద ఎంబ్రాయిడరీ వేయడం, మెహందీపెట్టడం నేర్చుకునేదాన్ని. మెహందీఆర్టిస్ట్​గా నా జర్నీ అప్పుడే మొదలైంది. పార్టీలు, ఫంక్షన్లకి మెహందీపెట్టడానికి వెళ్లేదాన్ని. అలా ఒకరోజు అంబానీల ఇంట్లో ఎంగేజ్​మెంట్​​ పార్టీకి వెళ్లాను. నా మెహందీఆర్ట్​ వాళ్లకి బాగా నచ్చింది. దాంతో పెండ్లికి  మెహందీపెట్టడానికి కూడా నన్నే పిలిచారు. అప్పటి నుంచి  ఆర్డర్లు రావడం మొదలైంది. ఆ తర్వాత బాలీవుడ్​లోనూ ఎంట్రీ ఇచ్చాను” అంటూ ఒకప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంది. నగ్డా.