- ఏదీ తీసుకున్నా కిలో రూ.60 నుంచి 80
- టమాటా, ఉల్లిగడ్డ కూడా రూ. 60 నుంచి రూ.70
- ఇతర రాష్ట్రాల్లో కురిసిన వానలతో తగ్గిన దిగుమతులు
హైదరాబాద్, వెలుగు : సిటీలో కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. వారం కిందట సామాన్యులకు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం రైతు బజార్లలో రేట్లు డబుల్ అయ్యాయి. బయటి మార్కెట్ లో మరింత ఎక్కువగా ఉంది. ఏ రకం కూరగాయలైనా రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతుంది. పచ్చి మిర్చి, బిన్నీస్ కిలో రూ.80 రేటు అధికంగా ఉంది. మొన్నటి వరకు రూ. 20 నుంచి రూ. 25 కిలో ఉన్న టమాటా, ఉల్లిగడ్డ ప్రస్తుతం కిలో రూ. 60 నుంచి రూ.70 పెరిగాయి.
వానల కారణంగా మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి దిమగుమతులు తగ్గడంతోనే రేట్లపై ప్రభావం పడిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.రేట్లు ఎంత పెరిగినా వినియోగదారులు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ధరలు పెరుగుతుంటూ పోతుంటే కొనలేని దుస్థితి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
వానలతో తగ్గిన దిగుమతులు
సిటీలోని ఆర్కేపురం, ఫలక్నుమా, అల్వాల్, ఎల్లమ్మబండ, మెహిదీపట్నం, వనస్థలిపురం, కూకట్పల్లి, సరూర్నగర్,ఎర్రగడ్డలో రైతుబజార్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు ఎక్కువగా రంగారెడ్డి, మేడ్చల్, చేవెళ్ల, వికారాబాద్, శంకర్‌పల్లి, సిద్దిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి ఎక్కువగా అవుతాయి. మరికొన్ని కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో వానల కారణంగా అక్కడి నుంచి రావాల్సిన కూరగాయలు రావడంలేదు.
సిటీకి వస్తున్న కూరగాయల్లో 60 శాతం మనరాష్ట్రంలోని జిల్లాల నుంచే దిగుమతి చేసుకుంటుండగా.. 40 శాతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. కూరగాయలు షార్టేజ్ కారణంగా ఆ ఎఫెక్ట్ రేట్లపై పడింది. సిటీలో డైలీ దాదాపు 600 నుంచి 800 టన్నుల కూరగాయలు అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం ఇందులో 60 శాతం వెజిటేబుల్స్ దిగుమతి అవుతాయి.
కొద్దిరోజులే ధరల ఎఫెక్ట్
ప్రస్తుతం పెరిగిన కూరగాయల రేట్లు తాత్కాలికమేనని మార్కెటింగ్, హార్టికల్చర్ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో అక్కడి నుంచి దిగుమతులు ఆగిపోయాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లో పరిస్థితి మారుతుందంటున్నారు. వానలు తగ్గిన వెంటనే దిగుమతులు పెరుగుతాయని, అప్పుడు ధరలు తగ్గుతాయంటున్నారు.
మనరాష్ట్రంలో కూడా కూరగాయల సాగు బాగానే ఉందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈనెలాఖరు వరకు కూరగాయల రేట్లలో మార్పు ఉండకపోవచ్చు.