ఆకుకూరల్ని వెరైటీగా ఇలా కూడా వండుకోవచ్చు...

ఆకుకూరల్ని వెరైటీగా ఇలా కూడా వండుకోవచ్చు...

ఇంట్లో ఆకుకూర వండితే చాలు ‘గడ్డికూర తినం’  అనేవాళ్లు ఎక్కువ. మరి ఆకుకూరల్లోని పోషకాలు మిస్ అయితే ఎలా? వాటిని పోనివ్వకూడదంటే ఆకుకూరల్ని వెరైటీగా ఇలా వండుకుంటే వదలకుండా తినేయొచ్చు. 
పాలకూర​తో...

ఆకుకూర ఆమ్లెట్

కావాల్సినవి :

కోడిగుడ్లు – నాలుగు
పాలకూర తరుగు – రెండు కప్పులు, ఉల్లిగడ్డ తరుగు – ముప్పావు కప్పు
ఉప్పు, నల్ల మిరియాల పొడి – సరిపడా, వెల్లుల్లి రెబ్బలు – మూడు (పెద్దవి), కొత్తిమీర – పావు కప్పు
పాలు లేదా నీళ్లు – పావు కప్పు 
నూనె – మూడు టేబుల్ స్పూన్లు

తయారీ :

పాన్​లో నూనె వేడి చేసి వెల్లుల్లి తరుగు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ, పాలకూర తరుగు వేసి వేగించాలి. ఒక గిన్నెలో కోడిగుడ్లు, పాలు, నల్ల మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని పాన్​లో వేసి కలపాలి. మూతపెట్టి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకుంటే అట్రాక్టివ్​గా ఉండే యమ్మీ పాలకూర ఆమ్లెట్ రెడీ. 

మునగాకు సాంబార్

కావాల్సినవి :

నూనె – ఒక టేబుల్ స్పూన్
కందిపప్పు – అర కప్పు
ఆవాలు – పావు టీస్పూన్
ఎండు మిర్చి – మూడు
మెంతులు, పసుపు, ఇంగువ – ఒక్కోటి చిటికెడు చొప్పున
ఉల్లిగడ్డలు – రెండు
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు, నీళ్లు – సరిపడా
చింతపండు రసం – అర కప్పు
మునగాకు – ఒక కప్పు
పచ్చి కొబ్బరి ముక్కలు – 
అర కప్పు,
సాంబార్ పొడి – పావు కప్పు

తయారీ :

ఒక పాన్​లో నూనె వేడి చేసి, అందులో ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు,  ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. ఇంగువ, పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు రసం, సాంబార్ పొడి వేసి కలపాలి. ఆ తర్వాత నీళ్లు పోసి మూతపెట్టి, ఐదు నిమిషాలు ఉడికించాలి. నానబెట్టి, ఉడకబెట్టిన కందిపప్పు, మునగాకు వేసి కలపాలి. అందులో చిటికెడు చక్కెర లేదా బెల్లం వేస్తే రుచిగా ఉంటుంది. ఈ సాంబార్​ తమిళనాడు స్పెషల్ రెసిపీ. ఇందులో మునగాకు బదులు మెంతికూర వేసి కూడా చేయొచ్చు. 

తోటకూర సమోసా

కావాల్సినవి :

గోధుమ పిండి – అర కప్పు
మైదా – ఒక కప్పు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, నీళ్లు – సరిపడా, కారం – ఒక టీస్పూన్
ఉల్లిగడ్డ – ఒకటి, తోటకూర తరుగు – అర కప్పు, పచ్చిమిర్చి – రెండు
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా – పావు టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, అటుకులు – ఒక కప్పు

తయారీ :

ఒక గిన్నెలో గోధుమ పిండి, మైదా, నూనె, ఉప్పు వేసి.. నీళ్లు పోసి ముద్ద చేయాలి. దానిపై మూత పెట్టి  అరగంట పక్కన పెట్టాలి. తర్వాత సన్నటి చపాతీలా వత్తి, రెండు వైపులా పది సెకన్లు కాల్చాలి. చివర్లు కత్తిరించి, సమోసా షీట్స్​ తయారుచేసుకోవాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తోటకూర, కొత్తిమీర తరుగు, కారం, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి, అటుకులు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెడీ చేసిన సమోసా షీట్స్​ని మడత పెట్టి అందులో ఈ మిశ్రమం పెట్టాలి. చిన్న గిన్నెలో మైదా, నీళ్లు కలిపి పేస్ట్​లా చేయాలి. చివరి మడతకు ఆ పేస్ట్​ పూసి  సమోసాను మూయాలి. చివరిగా కాగే నూనెలో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగిస్తే తోటకూర సమోసా తినడానికి రెడీ.