వెహికల్ స్క్రాపేజీ పాలసీ లాంచ్.. కొత్త రూల్స్‌తో లాభాలివే

వెహికల్ స్క్రాపేజీ పాలసీ లాంచ్..  కొత్త రూల్స్‌తో లాభాలివే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెట్టింది. గుజరాత్‌ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోడీ.. ఈ పాలసీని లాంచ్ చేశారు. ఈ పాలసీ వల్ల అన్‌ఫిట్‌ వాహనాలతోపాటు వాయు కాలుష్యానికి కారణమవుతున్న పాత వెహికల్స్‌ను గుర్తించడం సులువవుతుందని మోడీ అన్నారు. లైఫ్ టైమ్ దాటిన వాహనాలతోపాటు ఆటోమేటెడ్ టెస్టింగ్‌లో అన్‌ఫిట్‌గా తేలిన వెహికల్స్‌‌ను స్క్రాప్‌‌గా తేలుస్తారని చెప్పారు. భారత అభివృద్ధి ప్రయాణంలో వెహికల్ స్క్రాపేజీ పాలసీని తీసుకురావడం కీలకమైన మైలురాయని పేర్కొన్నారు. 

ఈ పాలసీతో కలిగే ప్రయోజనాలు

  • పాత వాహనాలను అమ్మి కొత్త వెహికిల్‌ను కొనాలనుకునే వారికి స్క్రాపేజీ పాలసీ ద్వారా మంచి ప్రయోజనాలు అందుకోవచ్చు. ఓల్డ్ వెహికిల్ ఎక్స్‌షోరూమ్ ధరను బట్టి ఇన్‌సెంటివ్స్ లభిస్తాయి.
  • కారును స్క్రాప్ చేయాలనుకునే వారికి 4 నుంచి 6 శాతం వరకు ఇన్‌సెంటివ్స్ లభిస్తాయి. 
  • పాత వాహనాలను స్క్రాప్‌కు ఇచ్చే యజమాని కొత్త కారు కొంటే రోడ్డు ట్యాక్స్‌పై 25 శాతం రాయితీ లభిస్తుంది. కమర్షియల్ వెహికల్స్‌కు ఈ రాయితీ శాతం 15 వరకు ఉంటుంది. 
  • ఓల్డ్ కారును స్క్రాప్ చేసి కొత్త కారును కొనుగోలు చేసే వారికి పర్‌చేస్‌పై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో వాహన రిజిస్ట్రేషన్ సమయంలో స్క్రాపింగ్ సర్టిఫికేట్ చూపిస్తే రిజిస్ట్రేషన్ ఫీజు పైనా మినహాయింపు దొరుకుతుంది. 

ఈ పాలసీ కిందకు వచ్చే వాహనాలేవంటే..?

  • వాహనాల రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వెంటనే అవి స్క్రాపేజీ పాలసీ కిందకు వస్తాయి. 
  • లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలకు వెంటనే ఫిట్‌నెస్ టెస్ట్ చేయించాలి. 
  • మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. ప్యాసింజర్ వాహనాల లైఫ్ టైమ్ 15 సంవత్సరాలు. అదే కమర్షియల్ వెహికల్స్‌ జీవిత కాలం 10 ఏళ్లుగా ఉంది. ఈ గడువు దాటిన వాహనాలను రోడ్లపై నడిపితే వాయు కాలుష్యానికి కారకులుగా చూస్తారు. 
  • లైఫ్ టైమ్ దాటిప వాహనాలు టెక్నాలజీ పరంగా రోడ్లపై తిప్పేందుకు అంతగా సురక్షితం కాదు. అందుకే వాటికి ఫిట్‌నెస్ టెస్ట్ చేయించాలి. ఆ టెస్టులో ఫెయిలైతే రెన్యూవల్ సర్టిఫికెట్ రాదు. అప్పుడు ఆయా వాహనాలను రోడ్లపై నడపడానికి వీలుండదు. 
  • ఒకవేళ ఫిట్‌నెస్ టెస్టులో వెహికల్స్ పాస్ అయితే రెన్యూవల్ సర్టిఫికెట్ వస్తుంది. తద్వారా మరో ఐదేళ్ల వరకు బండ్లను నడుపుకోవచ్చు. కానీ ప్రతి ఐదేళ్లకోసారి వాహనాలను ఫిట్‌నెస్ టెస్ట్ చేయిస్తూ ఉండాలి.