బ్రిడ్జి కట్టి రెండేళ్లయినా.. ఓ దిక్కు రోడ్డే లేదు

బ్రిడ్జి కట్టి రెండేళ్లయినా.. ఓ దిక్కు రోడ్డే లేదు
  • వెంకంపల్లి వద్ద మంజీరాపై బ్రిడ్జి కట్టి రెండేండ్లైనా స్టార్టవ్వని రాకపోకలు
  • కామారెడ్డి జిల్లా వైపు అసంపూర్తిగా రోడ్డు పనులు
  • మెదక్​జిల్లా వైపు రోడ్డే వేయలేదు
  • దూరభారంతో ప్రయాణికులకు ఇక్కట్లు

కామారెడ్డి, వెలుగు: రెండు జిల్లాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు, పలు గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. మంజీర నదిపై నిర్మించిన బ్రిడ్జి పనులు కంప్లీట్​అయి రెండేండ్లైనా ఇంకా పూర్తిస్థాయిలో రాకపోకలు స్టార్టవ్వలేదు. బ్రిడ్జికి ఒకవైపు వేస్తున్న రోడ్డు పనులు కొంత మేర కంప్లీట్​కాగా, మరో వైపు అసలు రోడ్డే వేయలేదు. 

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలానికి, మెదక్​జిల్లాలోని పాపన్నపేట మండలంలోని పలు గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించడం కోసం నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి శివారులో మంజీర నదిపై బ్రిడ్జి నిర్మించారు. కామారెడ్డి జిల్లా వైపు మెయిన్​రోడ్​నుంచి బ్రిడ్జి వరకు పనులు చేపట్టేందుకు రూ.33 కోట్లు శాంక్షనయ్యాయి. 6 ఏండ్ల కింద పనులు షూరు చేయగా, 2 ఏండ్ల క్రితం బ్రిడ్జి పనులు కంప్లీట్​చేశారు. కానీ రోడ్డు పనులు మాత్రం సగమే పూర్తయ్యాయి. 3 కిలోమీటర్ల మేర ఫారెస్ట్​ క్లియరెన్స్​ లేక పనులు ఆగాయి. ఇప్పటి వరకు కంప్లీట్​అయిన రోడ్​కూడా  అధ్వాన్నంగా మారింది. ఈ పనులు కంప్లీట్​అయితే జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేటతో పాటు పలు మండలాలకు చెందిన వారు మెదక్​జిల్లా పాపన్నపేట మండలానికి, బొడ్మట్​పల్లి హైవే జంక్షన్​వైపు వెళ్లడానికి దూరం తగ్గుతుంది. దీంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలకు రోడ్డు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల నాగిరెడ్డిపేట మండలవాసులు మెదక్​జిల్లాలోని పాపన్నపేటకు వెళ్లేందుకు మెదక్​మీదుగా 40 కిలోమీటర్లు తిరిగి వెళ్తున్నారు. కొత్తగా నిర్మించిన బ్రిడ్జి అందుబాటులోకి వస్తే 15 కిలోమీటర్ల ప్రయాణంతో పాపన్నపేట వెళ్లొచ్చు.

మెదక్ వైపు రోడ్డు లేక..

మెదక్​జిల్లా వైపు అసలు రోడ్డు నిర్మాణ పనులు షురూ చేయలేదు. బ్రిడ్జి నుంచి ముగ్ధంపూర్​వరకు రోడ్డు వేయాల్సి ఉంది. ఇక్కడి నుంచి పాపన్నపేట మెయిన్​రోడ్​వరకు సింగిల్ రోడ్​ఉంది. ఏండ్లు గడుస్తున్నా రోడ్​ వేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. దగ్గర గ్రామాలకు వెళ్లేవారు కొందరు నడచుకుంటూ వెంకంపల్లి వరకు వచ్చి ఇక్కడి నుంచి ఆటోల్లో వెళ్తున్నారు. ప్రజాప్రతినిధులు చొరవ చూపి త్వరగా పనులు పూర్తిచేసి 2 జిల్లాల మధ్య రాకపోకలను సులభతరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

బ్రిడ్జి కట్టి ఏం లాభం

బ్రిడ్జి కట్టినా మెదక్​ జిల్లా వైపు రోడ్​లేకపోవడంతో లాభం లేకుండా పోతుంది. రోడ్డు నిర్మిస్తే చాలా గ్రామాలకు వెహికల్స్​వెళ్లడానికి ఈజీ అవుతుంది. దూరం కూడా తగ్గుతుంది. దగ్గరి ఊళ్లవాళ్లు చుట్టూ తిరిగి రాలేక పంట పొలాల్లో నుంచి నడుచుకుంటు వస్తుర్రు.

అర్జున్, ముగ్ధంపూర్​

చుట్టూ తిరిగి పోతున్నం

రోడ్డు పనులు కంప్లీటై మంజీర బ్రిడ్జి మీది నుంచి వెళ్తే మాకు దూరం తగ్గుతుంది. పాపన్నపేటకు పోవాలంటే చుట్టూ తిరిగి పోతున్నం. మెదక్ వైపు ఇంకా అసలు రోడ్డే వేయలేదు. రెండు వైపుల ఒకేసారి రోడ్డు వేస్తే బాగుండే.

నారాయణ, నాగిరెడ్డిపేట 

క్లియరెన్స్​ వచ్చిన 3 నెలల్లో కంప్లీట్​ చేస్తాం..

మన జిల్లాలో 3 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు కంప్లీట్​కావాల్సి ఉంది. ఫారెస్ట్​ క్లియరెన్స్​తో పాటు, భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఫారెస్ట్​ క్లియరెన్స్​కాగానే 3 నెలల్లో పనులు కంప్లీట్​ చేస్తాం. మెదక్​జిల్లా వైపు కూడా రోడ్​ నిర్మాణానికి ప్రజోజల్స్​పంపినట్లు అక్కడి అధికారులు చెప్పారు.

రవిశంకర్, ఆర్​అండ్​బీ ఈఈ, కామారెడ్డి