జగిత్యాల, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల పట్టణ శివార్లలోని నేషనల్ హైవే-63పై రోడ్డును తవ్వి పనులు చేపట్టడాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ ఈ నెల 20న జరిగే కేసీఆర్ సభకు ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను అడ్డుకునేందుకే ఉద్దేశపూర్వకంగా హైవేను తవ్వినట్లు ఆరోపించారు.
బ్రిడ్జి పనులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు సభకు ముందు రోజుల్లోనే రోడ్డును కట్ చేయడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. ఈ అంశంపై ఆర్‌అండ్ బీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డైవర్షన్ రోడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

