ప్లాన్ ప్రకారం రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపట్టాలి : కలెక్టర్ ఎం. హరిత

ప్లాన్ ప్రకారం రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపట్టాలి : కలెక్టర్ ఎం. హరిత

వేములవాడ, వెలుగు: ప్లాన్‌‌ ప్రకారం --వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. మంగళవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం పలకగా ఈవో రమాదేవి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న కట్టడాల కూల్చివేత పనులను పరిశీలించారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధిపై ఆలయ గెస్ట్​ హౌస్‌‌లో వీటీడీఏ, ఆలయ అధికారులు, అర్చకులు, ఆర్అండ్‌‌బీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. 

పనుల నమూనాను ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి కలెక్టర్‌‌‌‌కు విపులంగా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయానికి  వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. ఆలయ విస్తరణకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రానున్న మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరకు ముందు భక్తులకు కలగకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు భీమేశ్వర ఆలయంలో చేపట్టనున్న అభిషేకం, అన్న పూజ, కోడె క్యూలైన్లు, కౌంటర్స్, ప్రసాదం తయారీ విభాగం ,నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం మండపంతోపాటు పలు ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు.