
ఖండాంతరాలు దాటి వెళ్లినా.. జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారని తానా సభ్యులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. కళారంగానికి ప్రాముఖ్యత ఇస్తూ.. కళాకారులను గుర్తించి వారిని సత్కరించడం గర్వంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కన్నా అమెరికాలోనే తెలుగు వెలుగుతోందని, మాతృభాష అభివృద్ధి కోసం ప్రవాసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఇక్కడున్న తెలుగువారు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. పిల్లలు మాతృభాషలో మాట్లాడేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని కోరారు. ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదన్న వెంకయ్య.. అమ్మభాషను మరిచిపోరాదని, మాతృభాషలో చదవడం వల్ల ఉన్నత పదవులు రావన్న భావన వద్దని చెప్పారు. ప్రస్తుత రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాతృభాషలోనే చదువుకుని ఉన్నత పదవులను చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కళామతల్లి ముద్దు బిడ్డలు కృష్ణవేణి, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కోదండరామిరెడ్డి వంటి వారిని వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సత్కరించారు.
ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారి కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటైన ప్రసిద్ధి సంస్థ తానా. ఈ సంఘం1978లో అధికారికంగా ఏర్పాటైంది. అయితే తానా మొదటి జాతీయ సమావేశం ఒక ఏడాది ముందే 1977లో జరిగింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి ఏదైనా ఆపద వచ్చినా, సమస్యలు వచ్చినా తానా ఆదుకుంటోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి అండగా పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది. అమెరికాలో ఉన్న తెలుగువారందరిని ఒక చోటకు చేర్చి కుటుంబ వేడుకగా ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు తానా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రత్యేకంగా అక్కడ వారు చేసే కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుకోవాలని నిర్ణయించారు. సుమారు 10 కోట్ల రూపాయలతో డిసెంబర్ 2 నుండి జనవరి 4వరకు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం 'తానా కళారాధన' పేరిట తెలుగు సినీ రంగంలో విశేష కృషి చేసిన సీనియర్లకి హైదరాబాద్ శిల్పకళా వేదికగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.