10 నుంచి వేంకటగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

 10 నుంచి వేంకటగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి  ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలోని వేంకటగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు రమాకాంత్ శర్మ వెల్లడించారు. ఈనెల 10న స్వస్తివాచనం, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన అంకురారోపణం పూజలతో బ్రహ్మోత్సవాలు షురూ కానున్నాయి. 11న అభిషేకం, ధ్వజస్తంభ పూజ, గణపతి, నవగ్రహ, సుదర్శన హోమం చేపట్టనున్నారు. 

12న ముఖ్య ఘట్టమైన లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సంప్రదాయం ప్రకారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్ నరసింహామూర్తి, ఈవో వెంకటరావు స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.