
మే డే సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ జాతి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిర్భయంగా, నిస్సంకోచంగా తెలియపరిచారు. ఆ ప్రసంగం ఒక మౌఖిక దార్శనిక పత్రం. ఒకరకంగా అది శ్వేతపత్రం. పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలన నుంచి అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలన ద్వారా ప్రగతిపథంలోనికి ప్రవేశిస్తోంది.
ఈ సమయంలో సమ్మె ప్రస్తావన రావడం దురదృష్టకరం. రాష్ట్ర రాబడికి, ఖర్చుకు మధ్య వ్యత్యాసం దాదాపు 4 వేల కోట్లు. అయినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం పాత బకాయిలను కొద్దికొద్దిగా చెల్లించడం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వ నిర్వాకం వలన 6,500 కోట్ల రూపాయలు వాయిదాలు, మిత్తీలకు ప్రతి నెల చెల్లించడం జరుగుతోంది.
గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు పెంచడం అనేది వారి ముందుచూపు. పదవీ విరమణలు 2024 మార్చి నుంచి ప్రారంభం అయ్యాయి. ఒక పథకం ప్రకారం పదవీ విరమణ వయస్సును పెంచారు. మనం ఓడిపోతే గెలిచిన ప్రభుత్వానికి పదవీ విరమణ భారం భరించేవిధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం అనేక ఆర్థిక సమస్యలను మెడకు తగిలించి, వెకిలి చేష్టలతో వేడుకలు చేసుకుంటోంది.
60వేల ఉద్యోగాల కల్పన
ఒక దొంగల ముఠా ఒక గ్రామాన్ని నిట్టనిలువునా దోచుకుని మరునాడు తెల్ల బట్టలు ధరించి, నాయకుల రూపమెత్తి.. అయ్యో ప్రజలకు, గ్రామానికి చాలా అన్యాయం జరిగింది. దీనికి ప్రభుత్వం బాధ్యతవహించి వారికి సహాయ సహకారాలు అందించాలని ధర్నా చేయడం ప్రారంభించింది. కానీ, ఈ ప్రస్తుత వినాశనానికి కారణం తామే అని సంగతిని మరిచి విమర్శించడం ఎంత ఆశ్చర్యం. గత ప్రభుత్వ అధినేతలు విమర్శించడం కూడా ఈ మాదిరిగానే ఉంది.
పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయాన్ని వ్యవసాయ క్షేత్రంలో పాతిపెట్టి, నేడు సామాజిక న్యాయం కోసం మరొక ఉద్యమం జరగాలి అనడం ఏపాటి విజ్ఞానం. ఇది విజ్ఞత కాదు. విధ్వంసం నుంచి వికాసం వైపునకు తెలంగాణ అడుగులు వేస్తోంది. 60 వేల ఉద్యోగాలు కల్పించడం, ఈ ప్రభుత్వం సాధించిన అతి గొప్ప విజయం. ఉద్యమ ఫలాలను కొందరే అనుభవించడం నిజంగా దురదృష్టకరం. తెలంగాణ యువకులు తమ ఊపిరిని వదిలి ప్రాణత్యాగం చేసి ఉద్యమానికి ఊపిరి ఊదారు. యువరక్తాన్ని ఎక్కించారు. దాని ఫలితమే రాష్ట్ర సాకారం.
దశాబ్దపు నిరంకుశత్వానికి పాతర
ధదీచి మహర్షి త్యాగ ఫలితమే ఇంద్రుని వజ్రాయుధం. మహర్షి వెన్నెముకనే వజ్రాయుధం. తెలంగాణ యువకులు ప్రాణత్యాగం చేసి అధికారాన్ని కట్టబెడితే వారి ఎముకలు (త్యాగాలను) బంగారు సింహాసనంగా మార్చుకుని దుష్టపరిపాలనను, మీ దుష్ట చతుష్టయం మాకు అందించింది. తెలంగాణ పేరు లేని పార్టీని ఏర్పరుచుకుని, డబ్బుతో గెలవాలని చాలా ప్రయత్నించారు. కానీ, తెలంగాణ బిడ్డలు, మేధావులు నిజాన్ని గ్రహించి దశాబ్దపు నిరంకుశత్వానికి పాతర వేశారు. అధికార పిపాసి, అవినీతి నివాసి. కొలువుల ప్రకటనల జాతర. నియామకాల పాతర. కొండంత రాగం. నిరంతర అభివృద్ధి జపం. ప్రజాధనం దుర్వినియోగం.. వారికి మాత్రం మహా ధనయోగం. మీ రాజనీతి. అతి అవినీతి.
రాష్ట్ర విధ్వంసానికి కారణమైన మీరు ‘అపర చాణక్యుడు’ అనే ఒక మహావ్యక్తి పేరును మీ నాయకునికి అంటించడం సరికాదు. ఆచార్య చాణక్యుడు, గొప్ప విద్వాంసుడు, దేశభక్తుడు, భరతజాతి సమాఖ్యతకు, పురోగతికి నిరంతరం కృషి చేసిన మహానుభావుడు. ఇతర దేశాల నుంచి భరతజాతిని రక్షించిన మహా మేధావి. జాతి మనుగడకు, భరతజాతిని మేలుకొలిపి, దేశ మనుగడకు, సంస్కృతి రక్షణకు తన తెలివితేటలను ఉపయోగించాడు. అదే చాణక్యనీతి. రాష్ట్ర ద్రోహులు, కపటం తప్ప మంచి కనపడని క్రూరులు. నియంతృత్వ పరిపాలన చేసిన మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర బహిష్కారం చేసి, వాక్స్వాతంత్ర్యాన్ని గొంతులోనే నొక్కి, ఉద్యోగులకుఇవ్వవలసిన డీఏ ఇతర ప్రోత్సాహకాలు నిరంతరం వాయిదా వేసిన మీరు కుటిల కుట్రదారులు, ఇది చాణక్యం కాదు. నియంతృత్వం, నిరంకుశత్వం.
వేణుగోపాల్ నారెడ్ల