Victory Venkatesh Politics: స్పీచ్ లతో దుమ్ము లేపుతున్న వెంకీమామ..మొన్న తెలంగాణ పాలిటిక్స్,ఇపుడు ఏపీ

Victory Venkatesh Politics: స్పీచ్ లతో దుమ్ము లేపుతున్న వెంకీమామ..మొన్న తెలంగాణ పాలిటిక్స్,ఇపుడు ఏపీ

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh)..టాలీవుడ్ లో ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ సీనియర్ హీరో.నిజం చెప్పాలంటే..ఏ ఇండస్ట్రీలోనైనా స్టార్ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ..అందరి హీరోల ఫ్యాన్స్ కు నచ్చే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకటేష్ అనే చెప్పాలి.

గొప్ప కుటుంబం నుండి వచ్చినా..ఆ గర్వం ఎక్కడా చూపించకుండా చాలా సాధారణంగా ఉండటం ఆయన నైజం. అందుకే ప్రతీఒక్కరు ఆయనని ఇష్టపడతారు.ఇపుడు వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో నిలబడిన నాయకులు హొరాహొరిన పాల్గొంటున్నారు.

అయితే వెంకటేష్..తన వియ్యంకుడు కోసం ఖమ్మంలో ప్రచారం నిర్వహించి..అదిరిపోయే బజ్ తీసుకొచ్చారు. ఇక తానూ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి (బీజేపీ) అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ప్రచారం చేశారు. కలిదిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ జంక్షన్ వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ మావయ్యను గెలిపించాలని ప్రజలను కోరారు. 

అంతే కాదు ఈ రోడ్ షోలో తనదైన ప్రసంగంతో ప్రజలను ఉర్రూతలూగించారు వెంకీ మామ."ఏంటీ ప్రేమ, ఏంటీ ఉత్సాహం, అక్కా, చెల్లి అంటూ సందడి చేశారు. మంచితనానికి మారుపేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాసరావు అని..భవిష్యత్తు బాగుండాలంటే ఆయనకి ఓటు వేయాలని కోరారు. అందుకు మే 13 గుర్తు పెట్టుకోండని చెప్పారు. వెంకీ మామగా..పెళ్లికాని ప్రసాద్‌ గా అడుగుతున్నా శ్రీనివాస్‌ మామను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు విక్టరీ వెంకటేష్.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే..ఎప్పుడు కాంట్రవర్సీకి, పాలిటిక్స్ కి దూరంగా ఉండే వెంకీ..ఇలా ప్రచారాలు చేస్తూ కనిపించడం అందరికీ కొత్తగా అనిపిస్తుంది. మరి ఎలాంటి రిజల్ట్ ను తీసుకొస్తాడో చూడాలి.