మేడిగడ్డపై విజిలెన్స్ తనిఖీలు

మేడిగడ్డపై విజిలెన్స్ తనిఖీలు
  • ఈఎన్సీ ఆఫీసుతో పాటు 12 చోట్ల సోదాలు
  • తనిఖీల్లో పాల్గొన్న 50 మంది ఆఫీసర్లు
  •  ఉదయం నుంచి కొనసాగుతున్న రెయిడ్స్
  • మహాదేవ్ పూర్ నుంచి హైదరాబాద్ కు ఫైళ్లు
  • మేడిగడ్డ , కన్నెపల్లి పంప్ హౌస్ ల ఆఫీసుల్లోనూ..
  • జలసౌధలోనే ఉన్న ఈఎన్సీ మురళీధర్ రావు

హైదరాబాద్: కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ తనిఖీలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి జలసౌధలోని ఈఎన్సీ ఆఫీసుతో పాటు ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో 12 ఆఫీసుల్లో 50 మంది విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  మహాదేవ్ పూర్ లోని నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు రికార్డులు సీజ్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు. ఎల్ఎండీ కాలనీలోని కాళేశ్వరం అనుబంధ ఇరిగేషన్ ఆఫీసులోనూ తనిఖీలు చేశారు. అక్కడి నుంచి రికార్డులను అధికారులు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మేడిగడ్డ , కన్నెపల్లి పంప్ హౌస్ లకు సంబంధించిన కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.  మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అధికారులు సైతం మేడిగడ్డ లోపాలను ఎత్తి చూపారు. ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపాలున్నాయని తేల్చిన సంగతి తెలిసిందే. దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎల్ఎండీ కాలనీలో ఉన్న కాలేశ్వరం అనుబంధ కార్యాలయంలో ఫైళ్లు మిస్సయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలు చేయిస్తున్నట్టు సమాచారం.  మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్లానింగ్ లోపమా..? నిర్మాణం నాసిరకంగా జరిగిందా..? అనే విషయాలను విజిలెన్స్ అధికారులు తేల్చే అవకాశం ఉంది.

ఉదయమే జలసౌధకు..

ఇవాళ ఢిల్లీలో కేఆర్ఎంబీ(కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్డు) సమావేశం ఉంది. ఆ సమావేశానికి రాష్ట్రం  నుంచి అధికారులు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయమే విజిలెన్స్ అధికారులు జలసౌధలోని రెండు, నాలుగు అంతస్థుల్లో ఉన్న ఈ ఎన్సీ ఆఫీసు, అనుబంధ కార్యాలయాల్లో తనిఖీలకు ఉపక్రమించింది. దీంతో ఈఎన్సీ మురళీధర్ రావుతోపాటు మిగతా అధికారులు ఆఫీసుల్లోనే ఉండిపోయారు. ఈఎన్సీగా మురళీధర్ రావు టర్మ్ లోనే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం సాగింది. ఈ సమయంలో కొంత కాలం ఇరిగేషన్ కార్యదర్శిగా కొంత కాలం రజత్ కుమార్ వ్యవహరించారు. ఆయన ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆ బాధ్యతలను స్మితా సబర్వాల్ చూశారు. విజిలెన్స్ తనిఖీల్లో ఏం బయటపడుతుందోననే టెన్షన్ ఇరిగేషన్ అధికారుల్లో పట్టుకుంది.