విజయ్ దేవరకొండ, సమంత జోడీగా కొత్త సినిమా షురూ

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా కొత్త సినిమా షురూ

హైదరాబాద్: టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ సరసన క్రేజీ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ యెర్నేని డైరెక్టర్ శివ నిర్వాణకు అందజేశారు.

కుటుంబ కథలో రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ, సమంతల ఈ కొత్త చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. గీత గోవిందం లాంటి ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో విజయ్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లైగర్ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న రౌడీ స్టార్.. ఆ తర్వాత మళ్లీ చక్కటి కుటుంబ కథలో యాక్ట్ చేయనుండటం విశేషం. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ.. మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించగా...ఈ సినిమా వారి పెయిర్ ను ఫుల్ ఫ్లెజ్డ్ గా తెరపై చూపించబోతోంది. 

మజిలీ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఈ సంస్థలో మరోసారి హీరోగా నటిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్ లో మొదలవుతుంది. అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పిలలో మిగతా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో సీనియర్ నటులు జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి నటించనున్నారు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు కూడా యాక్ట్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్న ఈ చిత్రానికి హిషామ్ అబ్దుల్ వాహబ్ బాణీలు సమకూర్చుతున్నారు. డీఓపీగా జి.మురళి వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

రష్యా గుప్పిట్లోకి ఉక్రెయిన్ ప్రధాన నగరం

సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం..!

జహంగీర్పురిలో భారీ భద్రత