Vijay Devarakonda: OTTలోకి 'కింగ్డమ్'.. కానీ ఆ సీన్లు లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి!

Vijay Devarakonda:  OTTలోకి 'కింగ్డమ్'.. కానీ ఆ సీన్లు లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి!

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే కలిసి నటించిన చిత్రం ' కింగ్ డమ్ '. ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఇప్పుడు ఈ  సినిమా ఓటీటీలోకి వచ్చింది.  నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.  అయితే, థియేటర్లలో ఉన్న సమస్యే ఇక్కడా కొనసాగడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

రొమాంటిక్ పాట కట్.. 
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సేకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఆమె పాత్రకు ప్రాముఖ్యత లేదని విమర్శలు వచ్చాయి. ఇది ఈ చిత్రానికి మైనస్ గా మారింది. అభిమానులను బాగా నిరాశపరిచింది. ఇక సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులను ఆకట్టుకున్న 'హృదయం లోపల' అనే రొమాంటిక్ పాటను థియేటర్లలో తొలగించారు. కథకు సరిపోవడం లేదని అందుకే తొలగించాల్సి వచ్చిందని ఆ సమయంలో నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చారు.

మళ్లీ అభిమానులకు నిరాశే..
 అయితే, ఓటీటీలోనైనా ఆ పాట ఉంటుందని అభిమానులు ఎంతో ఆశించారు.  కానీ ఇక్కడ కూడా ప్రేక్షకులను నిరాశే ఎదురైంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన వెర్షన్‌లో కూడా ఆ పాట కనిపించకపోవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.  చిత్ర బృందం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.. 

కథాంశం .. 
ఈ సినిమా కథ విషయానికొస్తే, సూరి (విజయ్ దేవరకొండ) అనే కానిస్టేబుల్ తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ అండర్ కవర్ మిషన్ కోసం శ్రీలంకలోని ఓ దీవికి గూఢచారిగా వెళ్లాల్సి వస్తుంది. ఆ ద్వీపంలోని తెగకు, శివకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూరి తన అన్నని ఎలా కనుగొన్నాడు అనే అంశాలతో ఈ కథనం ముందుకు సాగుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.

'కింగ్డమ్' సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో సత్యదేవ్, ఇతర నటీనటుల నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, సినిమాలో ప్రధానమైన ఎమోషన్ కనెక్ట్ కాకపోవడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఏదేమైనా, సినిమా ప్రచారం కోసం వాడిన ఒక పాటను, ఓటీటీలో కూడా తొలగించడంపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.