
టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కింగ్ డమ్' ( Kingdom ) . భారీ అంచాలతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూలై 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న "కింగ్‌డమ్" సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. దీంతో సినీ ప్రియులు తమ అభిమాన హీరో చిత్రాన్ని పెద్ద స్క్రీన్‌పై మరింత గ్రాండ్‌గా చూసే అవకాశం లభిస్తుంది
ఈ ప్రత్యేక అనుమతి సినిమా విడుదలైన మొదటి రోజు నుండి, అంటే 2025 జూలై 31 నుండి పది రోజుల పాటు అమలులో ఉంటుంది. మొదటి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50 , మల్టీప్లెక్స్ లలో రూ. 75 వరకూ పెంచుకునే వెసుల బాటును కల్పించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాతలకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించనుంది. మరో వైపు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చిత్ర బృందం కోరినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న విజయ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మరో వారం రోజుల్లో 'కింగ్ డమ్' సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో కాస్త వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులు విశాంత్రి తీసుకోవాలని చెప్పినప్పటికీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను ప్రమోట్ చేయాడానికి సెలెక్టివ్ మీడియా ఇంటరాక్షన్స్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
►ALSO READ | Bigg Boss 19 : బిగ్ బాస్ 19 సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ లీక్.. ఎన్ని కోట్లంటే?
దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించిన 'కింగ్ డమ్' పై అంచనాలు భారీగానే ఉన్నాయి . ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బొర్సె( Bhagyashree Borse ) హీరోయిన్‌గా నటిస్తోంది. మరో నటుడు సత్యదేవ్ (Satya Dev )కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ( Anirudh Ravichander ) సంగీతం అందిస్తుండటంతో, పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరో వైపు విజయ్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో 'VD 14' పేరుతో చేయబోతున్నారు. మరొకటి రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'SVC59 ' అనే మరో చిత్రంలో చేస్తున్నారు. మరో వారం రోజుల్లో విడుదల కానున్న 'కింగ్ డమ్ 'బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.