
కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా తాను విలాస జీవితానికి దూరంగా ఉంటానని బ్రిటన్ హైకోర్టులో తెలిపాడు. ఆయనకు సంబంధించిన ఎయిర్‌లైన్స్ నష్టాల పాలై మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినా, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి కూడా ఆయన విలాస జీవితానికి దూరంగా ఉండలేదు. ఇప్పటికీ లండన్‌లో కూడా ఆయన ఠీవి ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. అయితే ఇప్పట్నించి విలాస జీవితానికి దూరంగా ఉంటానని , ఖర్చులు తగ్గించుకుంటే ఆ మిగులు డబ్బులు భారత్‌కు చెందిన వివిధ బ్యాంకుల బకాయిలు చెల్లింపునకు ఉపయోగపడతాయని బ్రిటన్ హైకోర్టులో జరిగిన విచారణ సందర్బంగా ఆయన తెలిపాడు. సాధారణ జీవితం గడిపేందుకు వారంలో 18,325పౌండ్లు(దాదాపు రూ.16,00,000) వరకు ఖర్చు చేసేందుకు మాల్యాకు అనుమతి ఉంది. దీనిని నెలకు 29,500 పౌండ్లు( దాదాపు రూ.25,00,000) పరిమితం చేసుకునేందుకు ఆయన ఒప్పుకున్నాడు. మాల్యా చెప్పిన అంశాన్ని SBI నేతృత్వంలోని 13 బ్యాంకుల బృందం తిరస్కరించింది. లండన్‌లోని ICICI బ్యాంకులోని ఖాతాలో 2,60,000 పౌండ్లను బకాయిల కింద జమ కట్టేందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరాయి. రుణసంస్థలకు పూర్తిగా బకాయిలు చెల్లించేందుకు, భారత్‌లో కోర్టు విచారణ ప్రక్రియకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని అనేక సార్లు చెబుతూ వస్తున్న విషయాన్నికూడా మాల్యా న్యాయవాది ప్రస్తావించారు.