సౌత్ హీరోలపై మండిపడ్డ విజయ శాంతి

సౌత్ హీరోలపై మండిపడ్డ విజయ శాంతి

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల నటించిన లాల్ సింగ్ చడ్డాపై తీవ్ర వివాదం నడుస్తున్న విషయం తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై ప్రముఖ నటి విజయ శాంతి తీవ్రంగా స్పందించారు. ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే.. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నరని, బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేల్కొలుపుతున్నరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఫైర్ బ్రాండ్ విజయ శాంతి పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి కూడా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తెలుగులో మెగాస్టార్ సమర్పికుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 'దురదృష్టమేంటంటే.. ప్రజలు ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా.. మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్లు అమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీ షోల్లో పాల్గొంటున్నారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో.. వారు ఆలోచించాలంటూ రాములమ్మ రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.