ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న గ్రామసభలు 

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న గ్రామసభలు 
  • కొన్ని చోట్ల గ్రామసభలకు ఫారెస్ట్​ సిబ్బంది దూరం
  • భద్రాద్రి జిల్లాలో తుది దశకు ఫీల్డ్ సర్వే 

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూములకు పట్టాల పంపిణీకి కసరత్తు జరుగుతోంది. అయితే సర్వేకు సంబంధించిన గ్రామసభలు మొక్కుబడిగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. చాలాచోట్ల ఫారెస్ట్​ఆఫీసర్లు గ్రామసభలకు హాజరు కావడం లేదు. మరోవైపు రెవెన్యూ అధికారులు నామమాత్రంగానే ఈ సభలను నిర్వహిస్తున్నారు. సర్వే చేసేటప్పుడు వివాదాలు ఎందుకని రెవెన్యూ సిబ్బంది అన్ని దరఖాస్తులకు ఓకే చెబుతున్నారు. అయితే మండలస్థాయిలో నిర్వహించే ఎఫ్ఆర్​సీ మీటింగ్​లో అర్హత ఉన్న దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుందామని ఫారెస్ట్​ సిబ్బంది భావిస్తున్నట్లు సమాచారం. 

ఆవాసాల వారీగా గ్రామసభలు 

పోడు పట్టాల కోసం గిరిజనులు చేసుకున్న దరఖాస్తులను ఫీల్డ్​లో సర్వే చేసిన తర్వాత గ్రామసభల్లో వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతానికి సర్వే ముగింపు దశకు చేరుకోగా, ఖమ్మం జిల్లాలో రెండు వారాల క్రితమే సర్వే పూర్తయింది. ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​ శ్రీనివాసరావు మర్డర్​తో గ్రామసభలు కొద్ది రోజులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గడంతో ప్రస్తుతం గిరిజనులు నివసిస్తున్న ఆవాసాల వారీగా అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తులపై గ్రామస్తుల నుంచి ఫీడ్ బ్యాక్​ తీసుకుంటున్నారు. గ్రామసభలు ముగిసిన తర్వాత అప్లికేషన్లను ఆన్​లైన్​ చేసే టైంలో, ఆ భూములు 2005కు ముందునుంచి దరఖాస్తుదారుల ఆధీనంలో ఉన్నాయా లేదా అనే అంశాన్ని శాటిలైట్​మ్యాప్స్​ద్వారా ద్వారా గుర్తిస్తున్నారు. అనర్హులైన వారి అప్లికేషన్లను నాట్ ఇన్​ పొజిషన్​ పేరుతో రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

పాత వివాదాలు తెరపైకి.. 

ఖమ్మం జిల్లాలో సర్వే సందర్భంగా పాత వివాదా లు కొన్ని తెరపైకి వస్తున్నాయి. కారేపల్లి రేంజ్, ఊట్కూరు బీట్​పరిధి ఎర్రబోడు సమీపంలో పోడు ప్లాంటేషన్​లో మొక్కలు నరికివేశారంటూ వారం కింద ఫారెస్టు అధికారుల ఫిర్యాదుతో కారేపల్లి పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేశారు. గిరిజనులు చెబుతున్న ప్రకారం కొన్నేళ్లుగా దాదాపు 20 ఎకరాల్లో తాము పోడు చేసుకుంటున్నామని, కొద్ది నెలల కింద అధికారులు వచ్చి ప్లాంటేషన్​ కు పదెకరాలు అప్పగిస్తే, మిగిలిన పదెకరాలకు పట్టాలు ఇప్పిస్తామని ఆఫీసర్లు చెప్పారు. ఇప్పుడు ప్లాంటేషన్ పూర్తయ్యాక సర్వే చేయకపోవడంతో కోయగుంపు, వడ్డెరగుంపు, గుడితండాకు చెందిన గిరిజనులు గత నెల 20న ప్లాంటేషన్ భూమిలో కొన్ని మొక్కలను ధ్వంసం చేశారు. దీంతో 10 మంది పోడురైతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని పోడు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొనటంతో ఫారెస్టు డివిజనల్ అధికారి ప్రకాశ్​రావు సమక్షంలో మండల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, పోడుదారులతో చర్చించారు. ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం పోడు సాగులో ఉంటే పట్టాలు వస్తాయని సర్దిచెప్పారు.

ఉమ్మడి జిల్లాలో సర్వే తీరిలా..

ఖమ్మం జిల్లాలో 94 పంచాయతీల్లోని 132 ఆవాసాల్లో 42,409 ఎకరాలకు పోడు పట్టాల కోసం18,295 అప్లికేషన్లు వచ్చాయి. 46 టీముల ద్వారా ఫీల్డ్ సర్వేను కంప్లీట్ చేశారు. గ్రామసభల్లో ఆయా రైతులు ఎప్పుడు పోడు కొట్టుకున్నది ఎంక్వైరీ చేస్తున్నారు. గ్రామస్తులు చెప్పిన వివరాలను ఫారెస్ట్​సిబ్బంది దగ్గర ఉన్న శాటిలైట్ మ్యాప్స్​ లో చెక్ చేసుకుంటున్నారు. 2005 డిసెంబర్​13 కు ముందు పోడు సాగు చేసినట్టుగా తేలితేనే వాటిని ఆక్సెప్ట్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్లను మండల కమిటీలు, జిల్లా కమిటీల్లో ఆమోదించిన తర్వాత పట్టాలు పంపిణీ చేసే అవకాశముంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 336 గ్రామాల్లో 2,98,171 ఎకరాలకు 83,663 అప్లికేషన్లు వచ్చాయి. వీటికి ఫీల్డ్ సర్వే దాదాపు చివరి దశలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో భూమిని క్లయిమ్ చేస్తుండడంతో, సర్వే కోసం జిల్లాలో 305 టీమ్​ లను ఏర్పాటు చేశారు. ఆఫీసర్​ మర్డర్​ కారణంగా దాదాపు 10 రోజుల పాటు సర్వేకు బ్రేక్​ పడిందని అధికారులు చెబుతున్నారు.