రామగిరి మండలంలో ఇండ్ల కూల్చివేతల పై గ్రామస్తుల ధర్నా

రామగిరి మండలంలో ఇండ్ల కూల్చివేతల పై  గ్రామస్తుల ధర్నా

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో ఇండ్ల కూల్చివేతలపై గ్రామస్తులు మంగళవారం ధర్నాకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. రామగుండం 3 ఏరియా ఓసీ2 విస్తరణలో భాగంగా రామగిరి మండలం రాజాపూర్, బుధవారంపేట పంచాయతీ పరిధి సిద్ధపల్లి గ్రామంలో భూములు సేకరించడానికి సింగరేణి పనులు ప్రారంభించింది. 

కొద్దిరోజుల క్రితమే రాజాపూర్ గ్రామానికి అధికారులు వచ్చి ఇండ్లకి నంబర్లు వేశారు. అనంతరం సిద్ధపల్లి వద్ద ఇండ్లకు నంబర్లు వేయడానికి ప్రయత్నించగా,  బుధవారంపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. బుధవారంపేట రెవెన్యూ గ్రామాన్ని సింగరేణి పూర్తిగా సేకరించాలని, లేదంటే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. 

మంగళవారం పలువురు జిల్లా అధికారులతో పాటు రెవెన్యూ, సింగరేణి అధికారులు నిర్మాణాలు అక్రమమని జేసీబీలతో కూల్చివేసినట్లు బాధితులు తెలిపారు.  అధికారుల చర్యలపై ఆగ్రహించిన బుధవారంపేట, రాజాపూర్ గ్రామస్తులు మంథని– పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా ఎవరూ లేని సమయంలో ఇండ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఘటనాస్థలానికి చేరుకున్న గోదావరిఖని ఏసీపీ  గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా ఉన్నతాధికారులకు తెలియజేస్తానని నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. కాగా ఈ సమస్య చాలాకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. సింగరేణి విస్తరణలో భాగంగా బుధవారంపేట, రాజపూర్​ తదితర గ్రామాల వ్యవసాయ భూములు తీసుకున్న సంస్థ.. గ్రామంలోని ఇండ్లను వదిలివేసింది. దీంతో  గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. వ్యవసాయభూములతో పాటు ఇండ్లను కూడా మార్కెట్​ రేటు ప్రకారం తీసుకొని పునరావాసం కల్పించాలని కోరుతున్నారు.