
- నిధులు మంజూరైనా దక్కని ఫలితం
- కిలోమీటర్ల దూరం కాలినడకే మార్గం
- అటవీ శాఖ అనుమతులే అడ్డంకి
- వర్షాకాలం వచ్చిందంటే అంతే సంగతులు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన పల్లెలు, తండాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో దాదాపు రూ.24 కోట్లతో రోడ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆయా శాఖలకు నిధులు మంజూరైనప్పటికీ అటవీ అనుమతుల రాని కారణంగా పనులు ప్రారంభం కావడం లేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పల్లెలన్నీ రిజర్వ్ ఫారెస్ట్ సమీప ప్రాంతాల్లో ఉన్నాయి. దీని వల్లే అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కడెం, పెంబి, ఖానాపూర్, మామడ, సారంగాపూర్ తదితర మండలాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది.
- జిల్లాలోని కడెం మండలం ధర్మాజీపేట నుంచి లక్ష్మీసాగర్ వెళ్లే రోడ్డుకు, మాసాయిపేట నుంచి అక్కకొండ ఆలయానికి వెళ్లే రోడ్డుకు అటవీ శాఖ అనుమతుల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కొత్త మద్దిపడగ గ్రామానికి రోడ్డు మంజూరైనప్పటికీ అటవీ శాఖ అనుమతులు ఇప్పటికీ లభించలేదు.
- పీఎంజీఎస్ వై పథకంలో భాగంగా పెంబి మండలం రాసిమెట్ల నుంచి కొరటికల్ వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేరకు అటవీ అనుమతులు రావాల్సి ఉంది. ఇదే మండలంలోని ఆర్అండ్ బీ రోడ్డు నుంచి కొసగుట్ట వరకు ఖానాపూర్ మండలం ఎర్వచింతల గ్రామం నుంచి దతోజిపేట్ వరకు, కడెం మండలంలోని ఆర్అండ్ బీ రోడ్డు నుంచి అల్లంపల్లి వరకు 9 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రోడ్డుకు ఇప్పటివరకు అటవీశాఖ అనుమతులు జారీ చేయలేదు.
- ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తున్న రోడ్లకు మోక్షం కలగడం లేదు. కడెం మండలం పాండవాపూర్ గ్రామం నుంచి డ్యామ్ గూడ గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఒకటిన్నర కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రోడ్డు కోసం అటవీ శాఖ అనుమతులు జారీ చేయాల్సి ఉంది.
- రాయదారి గ్రామం నుంచి గోధుమల గ్రామం వరకు నిర్మించే రోడ్డు కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ పనులు ఇప్పటికి ప్రారంభం కాలేదు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 20 కోట్ల రూపాయల ప్రతిపాదనలు, ఐటీడీఏ పరిధిలో రూ. 3.20 కోట్ల ప్రతిపాదనలు రూపొందించినా అటవీ శాఖ అనుమతులు రావడం లేదు.
రోడ్డుపై నడవలేక పోతున్నాం...
తమ గ్రామానికి మంజూరైన రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు మొదలు కాలేదు. ఈ రోడ్డుపై నడవలేక అవస్థలు పడుతున్నాం. ఏళ్ల నుంచి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో తమ ఊరు నుంచి ఇంకో ఊరికి పోలేని పరిస్థితి ఉంంటుంది. ఇప్పటికైనా అటవీ శాఖ ద్వారా అనుమతులు తీసుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి.
- దుల్లే వెంకటేశ్, కొత్త మద్ది పడగ, కడెం
అటవీ శాఖ అనుమతులే కీలకం..
నిర్మల్ జిల్లాలో దాదాపు రూ. 20 కోట్ల విలువైన రోడ్ల పనులకు ప్రతిపాదనలు రూపొందించాం. ఈ రోడ్ల నిర్మాణాలకు అటవీశాఖ నుంచి అనుమతి లభించడం లేదు. ప్రభుత్వం నిధుల మంజూరుకు అంగీకరించింది. అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనులను ప్రారంభించలేకపోతున్నాం. అనుమతులు రాగానే పనులను చేపడతాం.
- శంకరయ్య, ఈ ఈ,
పంచాయతీరాజ్ శాఖ, నిర్మల్