జాబ్ ఇవ్వండి లేకపోతే ఆత్మహత్యకు పర్మిషన్​ ఇప్పించండి

జాబ్ ఇవ్వండి లేకపోతే ఆత్మహత్యకు పర్మిషన్​ ఇప్పించండి
  • జగిత్యాల జిల్లా ప్రజావాణిలో మానసిక వికలాంగుల తల్లి వినతి 
  • కరీంనగర్ గ్రీవెన్స్​కు పురుగుల మందు డబ్బాతో వచ్చిన రైతు 

జగిత్యాల, వెలుగు : ‘మానసిక వికలాంగులైన కొడుకులను సాదలేకపోతున్నా.. జాబ్ ఇప్పించండి లేదా ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అంటూ ముగ్గురు మానసిక వికలాంగుల తల్లి ప్రజావాణిలో వేడుకుంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత ముగ్గురు మానసిక వికలాంగులైన కొడుకులతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది. 2019 డిసెంబర్ ఐఈఆర్పీ(ఇన్​క్లూజివ్​ఎడ్యుకేషన్​ రీసోర్స్​పర్సన్) ఎగ్జామ్ లో 10వ ర్యాంక్ సాధించింది.  నియమాకాల్లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్​ జరగ్గా తనను నాన్ లోకల్ గా గుర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను నాన్ లోకల్ గా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. 

తాను అర్హురాలినైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయింది. మానసిక వికలాంగులైన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే పనైపోయిందని, ఐఈఆర్పీలో కాకుండా ఇతర పనులు చేయలేనని చెప్పింది. తనకు ఉద్యోగం ఇప్పించాలని, లేకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని, దానికి సర్కార్ అనుమతివ్వాలని వినతిపత్రంలో కోరింది. కొన్ని నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంది. ఆటో ఖర్చులకు డబ్బులు లేక చేబదులు అడుక్కుని వస్తున్నానని కన్నీటిపర్యంతమైంది. 

నకిలీ డాక్యుమెంట్లతో భూమి కాజేశారని.. 

కరీంనగర్ టౌన్ : కరీంనగర్ కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన  గ్రీవెన్స్ సెల్‌కు ఓ రైతు పురుగుల మందు డబ్బాతో రావడం కలకలం రేపింది. సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి రైతు నుంచి డబ్బా లాక్కున్నారు. బాధితుడి కథనం ప్రకారం..రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన గోళ్ల కనకయ్యకు 1.2 ఎకరాలుండేది. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి, అదే గ్రామానికి చెందిన కొందరు ధరణిలో నమోదు చేయించుకున్నారు. దీంతో ఆ భూమి విషయమై విచారణ చేసి తనకు న్యాయం చేయాలంటూ సోమవారం కనకయ్య కలెక్టరేట్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన చేతి సంచిలో పురుగు మందు డబ్బాను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది దానిని లాక్కున్నారు. తర్వాత లోపలికి పంపడంతో వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయాడు.