వినాయకుడిని కొలిస్తే విశ్వాన్ని కొలిచినట్లే

వినాయకుడిని కొలిస్తే విశ్వాన్ని కొలిచినట్లే

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. వాడవాడల్లో గణపయ్యల ప్రతిష్ఠలు. ప్రతి గల్లీలో గణనాథుడి పాటలు, భజనలు. వీధికో వినాయక మండపం, భారీ సెట్టింగులు. టౌన్లు, సిటీల్లో అయితే... ఆ సందడే వేరు. ఇక నిమజ్జనం రోజు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. వినాయక చవితి అంటే ఇవి మాత్రమే కాదు.. తొమ్మిది రోజుల పాటు భక్తిపారవశ్యంతో పూజలు చేయాలి. గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు సమర్పించాలి. అభిషేకాలు చేయాలి. వ్రతం ఆచరించాలి. వినాయకుడి మహిమల గురించి తెలిపే కథలు చదవాలి. ఆయన నామాన్ని జపించాలి. ఇలా ఇంకెన్నో... ఉంటాయి. అవన్నీ ఎలా తెలుసుకోవడం? 
 
ఒక్క వినాయకుడి విగ్రహంలోనే లోకమంతా కనిపిస్తుంది. అందుకే వినాయకుడిని కొలిస్తే విశ్వాన్ని కొలిచినట్లే. చిన్న ఎలుకపై వినాయకుడు ఉండటం.. పరిపూర్ణమైన ఈ విశ్వానికి గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్లు మేధస్సుకు సంకేతాలు. నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి ప్రతి రూపాలు. చేతిలో ఉండే పాశ, అంకుశాలు బుద్ధి, మనసులను మంచి మార్గంలో నడిపించే సాధనాలు. మొత్తంగా వినాయకుడి విగ్రహమే.. మనం చేయా ల్సిన కృషికి సంకేతం.

కొలిచే తీరుతో ప్రశాంతత

వినాయకుడి పూజ చేయడమంటేనే ధ్యానం చేయడం. ఒక క్రమపద్ధతిలో పూజలు చేయడం ఏకాగ్రతను పెంచుతుంది. దీనివల్ల జీవితంలో సమస్యలను ఎదు ర్కోగలిగే ధైర్యం వస్తుంది.

వ్యాధులు దూరం

ప్రకృతిలో దొరికే పత్రితో పూజించడం వల్ల వినాయ కుడి అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటు పూజ చేసిన వాళ్ల ఆరోగ్యానికి మేలు కూడా. గణపతిని పూజించే 21 రకాల పత్రుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఔషధ గుణాలు కళ్లు, చర్మం, మూత్ర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఆకులను చేతితో ముట్టుకోవడం, వాటి వాసన పీల్చడం వల్ల శ్వాస సమస్యలు దూరమవుతాయి. గణపతికి ప్రీతిపా త్రమైన గరికలో కూడా ఔషధగుణాలున్నాయి.

పాలవెల్లి

వినాయకుడే విశ్వం అని చెప్పేందుకు పాలవెల్లి ఓ ఉదాహరణ. భూమి, సూర్యుడు, గ్రహాలు.. ఇలా సౌర కుటుంబం అంతా పాలవెల్లి అనే ఖగోళ ప్రదేశంలో ఉంది. అందుకే వినాయకచవితి రోజు విగ్రహంపైన దీర్ఘ చతురస్రాకార చట్రంలో పాలవెల్లిని పెడతారు.

గుంజీలు తీయడంతో జ్ఞానం

పూజలో విగ్రహం దగ్గర పుస్తకాలు పెట్టి, గుంజీలు తీస్తాం. ఇదంతా కూడా జ్ఞానానికి ప్రతీక. చేతులతో చెవులు పట్టుకుని 21 సార్లు గుంజీలు తీయడంతో జ్ఞానం పెరుగుతుంది. ఇలా.. ఆ పూజ వెనకున్న రహ స్యాన్ని అర్థం చేసుకున్నవాళ్లకి కచ్చితంగా ముక్తిని ప్రసాదిస్తాడు దేవదేవుడు. అందుకే ఈ చవితినాడు వినాయకుడ్ని పూజించి.. ఆ పూజలోని పరమార్థాన్ని తెలుసుకోవాలి.