రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే డార్లింగ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) విడుదలకు రెడీ అయింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హర్రర్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం ఒక అద్భుతమైన మ్యూజికల్ సర్ప్రైజ్ను అభిమానులకు అందించింది.
రాజే యువరాజే.. మ్యాజికల్ ప్రోమో!
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రాజే యువరాజే..’ (Raje Yuvaraje) అనే పాట ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో ప్రభాస్ లుక్ చూస్తుంటే అభిమానులకు 'బుజ్జిగాడు', 'డార్లింగ్' రోజులు గుర్తొస్తున్నాయి. కలర్‌ఫుల్ సెట్స్, ప్రభాస్ స్టైలిష్ వింటేజ్ అప్పియరెన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రోమోలో ప్రభాస్ చర్చిలో శాంటా క్లాజ్ విగ్రహం ముందు ప్రార్థిస్తూ, తన ప్రేమ కోసం వెదుకుతున్నట్లు కనిపించడం ఆకట్టుకుంటోంది.
థమన్ మ్యూజిక్..
మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'రెబల్ సాబ్' సాంగ్ ఒక ఊపు ఊపగా.. ఇప్పుడు ‘రాజే యువరాజే’ ప్రోమోలోని మెలోడీ ట్యూన్ మ్యాజికల్‌గా ఉంది. త్వరలోనే ఈ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు అందాల భామలు నటిస్తూ గ్లామర్ డోస్ పెంచుతున్నారు.
►ALSO READ | Shah Rukh Khan : రజనీకాంత్ 'జైలర్ 2'లో షారుఖ్ ఖాన్?.. మిథున్ చక్రవర్తి లీక్‌తో ఫ్యాన్స్ ఖుషీ!
సంక్రాంతి రేసులో రాజా సాబ్!
ఈ చిత్రాన్ని జనవరి 9, 2026న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'U/A' సర్టిఫికేట్ లభించింది. సినిమాలో కేవలం హర్రర్, కామెడీ మాత్రమే కాకుండా.. ఒక హవేలీ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, బొమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మారుతి మార్క్ కామెడీతో పాటు ప్రభాస్ స్వాగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
