
మహారాష్ట్రలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలు హింసాత్మకంగా మారాయి. ఈ గొడవల్లో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మత నాయకుడిపై ఇన్ స్టాగ్రామ్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇది చినికి చినికి గాలి వానగా మారడంతో ఘర్షణ తీవ్రత పెరిగింది.
ఈ గొడవల్లో రెండు గ్రూపుల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలకు నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా మరో ఎనిమిది మంది గాయపడినట్లు ఎస్పీ సందీప్ ఘుగే తెలిపారు. చనిపోయిన వ్యక్తి విలాస్ గైక్వాడ్ గా తాము గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు.