వాళ్లకు భారత్ తప్ప మరో దారిలేదు: మోడీ

వాళ్లకు భారత్ తప్ప మరో దారిలేదు: మోడీ
  • పౌరసత్వ సవరణ చట్టం భారత సంస్కృతికి ప్రతిరూపం
  • హింసాత్మక నిరసనలు బాధాకరం.. విధ్వంసం తగదు
  • చిచ్చుపెట్టి విభజించాలనుకునే వాళ్ల ఆటలు చెల్లవు: ప్రధాని

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న హింసాత్మక నిరసనలు విరమించాలని ప్రధాని మోడీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల్లో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, జనజీవనానికి ఇబ్బంది కలిగించడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చర్యలు బాధాకరమని, దురదృష్టమని అన్నారు మోడీ. ప్రజలను సమయమనం పాటించాల్సిందిగా ఆయన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కొందరు తమ స్వార్థం కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కోరారాయన. విధ్వంసం సృష్టించి, మన మధ్య చిచ్చుపెట్టి విభజించాలని ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు.

ఐక్యంగా ముందుకు..

పారసత్వ సవరణ చట్టంతో భారత్‌లోని  ఏ మతానికి చెందిన వారికీ నష్టం కలిగించబోదని భరోసా ఇస్తున్నానని మోడీ అన్నారు. మన పొరుగు దేశాల్లో ఏళ్లుగా మత హింసకు గురై శరణార్థులుగా వచ్చిన వారి కోసమే చట్ట సవరణ చేశామన్నారు. వారికి భారత్ తప్ప మరో దారిలేదని, శరణు అంటూ వచ్చినవాళ్లకు ఆశ్రయం కల్పిస్తామన్న భారత సంస్కృతికి ఈ చట్టం నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు ప్రధాని మోడీ.  పలు రాజకీయ పార్టీల భారీ మద్దతుతో పార్లమెంటులో ఈ చట్టం ఆమోదం పొందిందని గుర్తు చేశారాయన. శాంతి, సామరస్యాలు, సోదర భావంతో ఐక్యంగా ఉన్నామన్న సందేశాన్ని ఇవ్వడమే ప్రస్తుతం మన బాధ్యత అన్నారు. ఒక్కటిగా ఉండి నిరుపేదలు, వెనుబడిన ప్రతి భారతీయుడి అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన సమయమిది అని చెప్పారు మోడీ. మనల్ని విభజించాలనుకుంటున్న వాళ్ల ఆటలు చెల్లవని నిరూపించాలని పిలుపునిచ్చారు.