
- సర్ది, దగ్గు, ఫీవర్‌తో హాస్పిటల్స్‌కు క్యూ
- కిక్కిరిసిపోతున్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్
- ఆగస్టుతో పోలిస్తే 40% పైగా పెరిగిన జనరల్ ఓపీ
- వందల్లో డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు
- వరుస వర్షాలు, వాతావరణ మార్పులే కారణమంటున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ ఫీవర్స్ తో పాటు, ఆహారం, నీరు కలుషితమై వచ్చే డయేరియా, కలరా, వర్షపు నీటి నిల్వలతో దోమలు విజృంభించి డెంగ్యూ, మలేరియా, టైఫాయిట్ లాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులతో పాటు జిల్లా హాస్పిటల్స్, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. రోజూ హాస్పిటళ్ల ముందు వందల సంఖ్యలో జ్వర బాధితులు క్యూ కడుతున్నారు. ఆగస్టులో ఆయా హాస్పిటళ్లలో సగటున 400 నుంచి 600 కేసులు నమోదుకాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 800 నుంచి వెయ్యికి చేరింది. ప్రధాన ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 40 శాతం పైనే పెరిగిన కేసుల సంఖ్య.. సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది.
వర్షాకాలం, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విభృంభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి పది మందిలో ఇద్దరు వైరల్ ఫీవర్ తో సఫర్ అవుతున్నట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వెయ్యి కేసుల్లో సగటున వంద మందిని ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ (ఎన్సీవీబీడీసీ) ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో 267 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 5 వేల మందికి పైగా డెంగీ బారినపడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదయ్యే కేసుల సంఖ్యకు లెక్కేలేదు. అలాగే, ఈ ఏడాది ఇప్పటి దాకా ఎన్సీవీబీడీసీ ప్రకారం.. 795 మలేరియా కేసులు రిజిస్టర్ అయ్యాయి. అనధికారికంగా మలేరియా కేసులు కూడా ఎక్కువే ఉండొచ్చు. వీటితో పాటు టైఫాయిడ్, న్యూమోనియా, డయోరియా, కలరా వంటి సమస్యలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండో వారంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు.
ప్లేట్ లెట్స్ తగ్గితే ఆందోళన వద్దు
ప్రస్తుతం డెంగీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులు ప్లేట్లెట్స్ పేరు మీద దందాకు తెరలేపాయి. ప్లేట్లెట్స్ తగ్గాయంటూ ప్రజల నుంచి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. అయితే, ప్లేట్లెట్స్ తగ్గాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచిస్తున్నారు. డెంగీ జ్వరం వచ్చిందంటే సాధారణంగానే ప్లేట్లెట్స్ తగ్గుతాయి. డెంగీ జ్వరం వచ్చినవారిలో ప్లేట్లెట్స్ లక్షకు తక్కువ కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అవి 20వేలకు తగ్గినా ఆందోళన చెందనవసరం లేదు. ప్లేట్లెట్స్ తగ్గి, రక్తస్రావం సమస్య ఉంటేనే తీవ్రమైన సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం వందలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులతో కూడిన వైద్యాన్ని అందిస్తున్నారని, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ప్లేట్లెట్స్ పేరుతో ఆందోళన చెంది లక్షలు ధారపొయ్యొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. సీజనల్ ఫీవర్స్ వచ్చినవారిలో చాలా వరకు వాటంతట అవే తగ్గుముఖం పడతాయి. సర్ది, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకట్రెండు రోజులు చూసి డాక్టర్ ను సంప్రదించాలి. సొంత వైద్యం పనికిరాదు. పరిసరాలను క్లీన్‌గా ఉంచుకోవడంతో పాటు, వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలని ప్రజలకు డాక్టర్లు సూచిస్తున్నారు.
జిల్లాల్లోనూ భారీగా పెరిగిన వైరల్ ఫీవర్ కేసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణంగా రోజూ 400 నుంచి 600 వరకు ఓపీ ఉండేది. ఫీవర్స్ సీజన్ స్టార్ట్ అయ్యాక అది 700 నుంచి 800కు పెరిగింది. ఎక్కువగా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లాలో చాలా మంది డెంగ్యూ, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. మెదక్ లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌తో పాటు, సీహెచ్ సీ, పీహెచ్ సీలకు జ్వర బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఇటీవల కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన 9 ఏండ్ల సుశాంత్ చారి అనే స్టూడెంట్ డెంగ్యూ జ్వరంతో చనిపోయాడు. మరో విద్యార్థి కొన్యాల సుమన్ (14) జ్వరంతో ఉండగా ఫిట్స్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 50కు పైగా డెంగ్యూ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ముగ్గురు డెంగ్యూతో చనిపోయారు. చాలా మంది వైరల్ ఫీవర్స్ బారినపడి ప్రైవేటు హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ లో శ్రవణ్ (17), మహేశ్ (32), అనంతసాగర్ లో యశ్వంత్ (10) డెంగ్యూతో చనిపోయారు. నెల రోజుల్లో జిల్లాల్లోని సీహెచ్సీ, పీహెచ్సీలతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో దాదాపు 10 వేల వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి.
ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాలి
సీజనల్ ఫీవర్స్, న్యూమోనియా వంటి జ్వరాలు రాకుండా ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకొక్కల్ వ్యాక్సిన్ ను ఏడాదికి ఒకసారైనా తీసుకోవాలి. అనవసరంగా యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. డాక్టర్ల సూచనమేరకే అవసరమైన మందులు వాడాలి. సీజనల్ ఫీవర్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలి.
- ప్రొఫెసర్, డాక్టర్ రాజారావు, ప్రిన్సిపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ