
పూర్వం రాజులకు పదుల సంఖ్యలో భార్యలు ఉండేవారని చెబుతుంటే వినేవాళ్లం. కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్లుంటారా? అసలు ఆ ఆలోచనే విచిత్రంగా ఉంది కదూ!! ఈ 21వ శతాబ్దపు ఆధునిక కాలంలో అదెలా సాధ్యమని అనిపిస్తోంది కదా! కానీ ఈ పెద్దాయన ఆ అసాధ్యాన్ని తన జీవితంలో నిజం చేసి చూపించాడు. ముసలోడైపోయినా సరే 37వ పెండ్లి చేసుకుంటూ జాలీగా కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఐపీఎస్ ఆఫీసర్ రుపిన్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ మనిషి పెద్ద ధైర్యశాలి అంటూ.. తన 28 మంది భార్యల ఎదుటనే 37వ పెండ్లి చేసుకుంటున్నాడని ఆయన పోస్ట్‌లో రాశారు. ఈ సమయంలో ఆయన సంతానం 35 మంది, 126 మంది మనుమలు ఉన్నారని చెబుతూ ఈ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చూస్తే పెండ్లి చేసుకుంటున్న పెద్దాయనకు దాదాపు 70 ఏండ్ల వరకూ వయసు ఉంటుందనిపిస్తోంది. ఆయనను కట్టుకుంటున్న మహిళకు మాత్రం 30 ఏండ్లు కూడా దాటి ఉండవేమో అనిపిస్తోంది. ఆ ముసలాయన వధువుకు ముద్దు పెట్టి కుర్చీలో కూర్చుంటుండగా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు అంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే అసలు ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందినది.. అందులో ఉన్న వాళ్లు ఎక్కడి వాళ్లు అన్న విషయాలపై ఎటువంటి క్లారిటీ లేదు.
BRAVEST MAN..... LIVING
— Rupin Sharma IPS (@rupin1992) June 6, 2021
37th marriage in front of 28 wives, 135 children and 126 grandchildren.?? pic.twitter.com/DGyx4wBkHY
ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 28 వేల మందికి పైగా చూశారు. 900 మందికి పైగా లైక్ చేయగా, 475 మంది రీట్వీట్ చేశారు. నెటిజన్లు చాలా మంది దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఏం అదృష్టం రా.. ఇక్కడ ఒక్కరిని చూసుకోవడానికే చాలా కష్టంగా ఉంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. లివింగ్ లెజెండ్ అంటూ కొందరు, మేం ఇంకా సింగిల్‌గానే ఉన్నాం.. ఇలా చచ్చిపోతామేమో అని మరికొందరు కామెంట్లు పెట్టారు.