బెంగుళూరులో మరో దారుణం: నడి రోడ్డు పై స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌పై దాడి..

బెంగుళూరులో మరో దారుణం: నడి రోడ్డు పై స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌పై దాడి..

కర్ణాటక బెంగళూరులోని మోడీ హాస్పిటల్ సర్కిల్  ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిన్న రాత్రి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏంటంటే స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన బైకును ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపినప్పుడు ఈ గొడవ జరిగింది. అయితే సిగ్నల్  వద్ద అతను ఆగినప్పుడు అతని వెనక వస్తున్న ఒక వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. రెడ్ సిగ్నల్ పడినా సరే, పదే పదే హారన్ కొడుతూ ముందుకు వెళ్ళమని డెలివరీ ఏజెంట్‌ను తిట్టారు. రెడ్ సిగ్నల్ పడింది, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నానని డెలివరీ బాయ్ చెప్పడానికి ప్రయత్నించగా, వీరి మధ్య వాగ్వాదం మొదలైంది.

కొద్ది క్షణాల్లోనే వీరి మధ్య మాటల యుద్ధం కాస్తా దాడికి దారితీసింది. దింతో ఆ ముగ్గురు వ్యక్తులు వాహనం నుండి దిగి డెలివరీ ఏజెంట్‌ను రోడ్డుపైనే దారుణంగా కొట్టారు. అతనికి రక్తం వచ్చేలా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణమైన దాడి మొత్తం సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే తనపై దాడి చేసిన వారు మద్యం మత్తులో ఉన్నట్లు బాధితుడు చెబుతున్నాడు.

దాడి తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన డెలివరీ బాయ్ వెంటనే బసవేశ్వరనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  చెప్పారు. 

ప్రస్తుతానికి, ఈ ఘటనకు సంబంధించి స్విగ్గీ నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. గత నెల మేలో బసవేశ్వరనగర్‌లో ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్  అడ్రస్ తప్పు పెట్టారని కస్టమర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయింది. 

దింతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి, అతను పనిచేసిన జెప్టో కంపెనీకి నోటీసు పంపారు. మరో కేసులో, ఒక మహిళకి డెలివరీ ఏజెంట్ ఫుడ్  డెలివరీ అందించినట్లు చెప్పి, తరువాత కస్టమర్ మోసం చేసినట్లు ఆరోపించారు. ఈ రెండు కేసులు డెలివరీ ఏజెంట్ ప్రవర్తనలపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి.