సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గ్రేడ్ A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేయడం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎలైట్ గ్రేడ్ A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఈ మోడల్‌ను అపెక్స్ కౌన్సిల్ ఆమోదించినట్లయితే.. నాలుగు కేటగిరిలు బదులుగా A, B, C అనే మూడు కేటగిరిలు మాత్రమే ఉంటాయి. చివరిసారిగా బీసీసీఐ ప్రకటించిన A+ కేటగిరీ కోహ్లీ, రోహిత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి సంవత్సరానికి రూ. 7 కోట్ల ఆదాయం లభిస్తుంది.
గ్రేడ్ 'B'కి పడిపోనున్న రోహిత్, కోహ్లీ:
అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు భారత క్రికెటర్ల ప్రదర్శన బట్టి కేటగిరీలు ఎంపిక చేయనున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా కోహ్లీ, రోహిత్ ఏ ప్లస్ కేటగిరి నుంచి B కేటగిరికి పడిపోనున్నట్టు సమాచారం. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం ఒకే ఫార్మాట్ ఆడుతున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో స్థానం సంపాదించాలంటే టెస్ట్ క్రికెట్ ఖచ్చితంగా ఆడాలి. కానీ రోహిత్, విరాట్ మాత్రం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. దీంతో వీరికి డిమోషన్ తప్పేలా లేదు. చివరిసారిగా బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో కోహ్లీ, రోహిత్ ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు.
అప్పటికీ వీరిద్దరూ టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతుండడంతో ఏ ప్లస్ కేటగిరిలో కొనసాగారు. ప్రస్తుతం వీరు వన్డే క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్నా ఫలితం ఒకే ఫార్మాట్ ఆడడం వీరికి మైనస్ గా మారింది. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ కూడా నెక్స్ట్ లెవల్ ఫామ్ లో ఉన్నారు. బీసీసీఐ తమ చివరి వార్షిక ఆటగాళ్ల ఒప్పందాలను ఏప్రిల్ 2025లో ప్రకటించింది. సాధారణంగా బీసీసీఐ ఫిబ్రవరి లేదా మార్చిలో కాంట్రాక్టులను ప్రకటిస్తుంది. కానీ ఈ కొంచెం ముందుగా ప్రకటించే అవకాశం ఉంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల వార్షిత వేతనం విషయానికొస్తే.. ‘A+’ గ్రేడ్ క్రికెటర్లకు రూ.7 కోట్ల శాలరీ, గ్రేడ్ ‘A’ కు ఎంపికైన క్రికెటర్లకు 5 కోట్లు, గ్రేడ్ ‘B’ కి ఎంపికైన క్రికెటర్లకు 3 కోట్లు, గ్రేడ్ ‘C’ కి ఎంపికైన క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది. కాంట్రాక్టుకు అర్హత సాధించాలంటే ఒక సంవత్సరంలో కనీసం మూడు టెస్ట్ మ్యాచులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ‘A+’ గ్రేడ్ తప్పిస్తే గ్రేడ్ ‘A’ కు ఎంపికైన క్రికెటర్లకు 5 కోట్లు, గ్రేడ్ ‘B’ కి ఎంపికైన క్రికెటర్లకు 3 కోట్లు, గ్రేడ్ ‘C’ కి ఎంపికైన క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది.
