Virat Kohli: 2028 మార్చిలో కోహ్లీ రిటైర్మెంట్.. 8 ఏళ్ల కిందటే ఊహించిన ఆస్ట్రాలజర్!

Virat Kohli: 2028 మార్చిలో కోహ్లీ రిటైర్మెంట్.. 8 ఏళ్ల కిందటే ఊహించిన ఆస్ట్రాలజర్!

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ఇటీవల తమ జీవితంలోకి రెండో సంతానాన్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. 2024, ఫిబ్రవరి 15న లండన్‌లో కోహ్లీ సతీమణి ఓ మగబిడ్డకు జన్మినిచ్చింది. తమ జీవితంలోకి బాబు వచ్చినట్లు, ఆ పిల్లాడికి 'అకాయ్' అని పేరు పెట్టినట్లు.. విరాట్ సతీమణి ఫిబ్రవరి 20న ప్రకటన చేశారు. ఇదంతా జరిగిపోయిన విషయం. ఇప్పుడు వైరలవుతోన్న విషయం ఏంటంటే.. అకాయ్ జన్మను ఓ ప్రముఖ ఆస్ట్రాలజర్ 8 ఏళ్ల కిందటే ఊహించారు.

విరాట్ కోహ్లీ వైవాహిక జీవితం, అతని క్రికెట్ కెరీర్, పిల్లలు పుట్టే తేదీ సహా పలు విషయాలను ఓ జ్యోతిష్యుడు 2016లోనే కచ్చితత్వంతో అంచనా వేశారు. ఆ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. 2016, 2017 రెండేళ్లలో కోహ్లీ గొప్ప స్టార్‌డమ్‌ సంపాదిస్తాడన్న జ్యోతిష్యుడు, 2017 జనవరిలో శని.. వృశ్చిక రాశి నుండి బయటికి రావడంతో 2016తో పోలిస్తే 2017లో అతని క్రికెట్ కెరీర్ మరింత గొప్పగా ఉంటుందని అంచనా వేశారు.

2018-2020 మధ్య మొదటి సంతానం

2017 మార్చి/ఏప్రిల్ నెలల్లో విరాట్‌ వివాహం గురించి చర్చలు తెరపైకి వస్తాయని తెలిపిన ఆస్ట్రాలజర్.. 2017 చివర లేదా 2018 ప్రారంభంలో అతను పెళ్లి చేసుకుంటాడని అంచనా వేశారు. ఆయన చెప్పినట్లుగానే కోహ్లీ, అనుష్క శర్మ జంట 2017 డిసెంబర్ 11న ఒక్కటయ్యారు. వివాహం అనంతరం కోహ్లీ ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పారు. అలాగే, ఫిబ్రవరి 2018- సెప్టెంబర్ 2020 మధ్య అతను మొదటి సంతానం పొందుతాడని, ఆ బిడ్డ తండ్రికి అపారమైన సంపదను, అదృష్టాన్ని తెస్తుందని అంచనా వేశారు. 

అకాయ్ జన్మ

సెప్టెంబరు 2020 నుంచి సెప్టెంబర్ 2021 వరకు ఏడాది పాటు కోహ్లీ ఒడిదుడుకులు ఎదుర్కొంటాడని జ్యోతిష్యుడు అంచనా వేశారు. అనంతరం సెప్టెంబరు 2021 నుంచి 2025 చివరి వరకు అతని క్రికెట్ ప్రయాణానికి తిరుగులేదని వివరించాడు. ఈ సమయంలోనే (2021-2024 మధ్య కాలంలో) విరాట్‌ సతీమణి మరో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆస్ట్రాలజర్ చెప్పినట్లుగానే 2024, ఫిబ్రవరి 15న కోహ్లీ సతీమణి ఓ మగబిడ్డ(అకాయ్)కు జన్మినిచ్చింది. 

2028 మార్చిలో రిటైర్మెంట్

ఆగస్ట్ 2025 నుంచి ఫిబ్రవరి 2027 మధ్య విరాట్ క్రికెట్ కెరీర్ గొప్పగా ఉండదని, ఆ సమయంలో అందరిచేత విమర్శలు ఎదుర్కొంటారని వివరించారు. అనంతరం 2027లో పుంజుకొని ఉన్నత స్థితికి చేరుకుంటాడని అంచనా వేశారు. చివరగా 2028 మార్చిలో కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే, విరాట్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతాడని వివరించారు. 8 ఏళ్ల కిందట ఆస్ట్రాలజర్ చెప్పిన ఈ జాతకం నెట్టింట వైరల్ అవుతోంది.