స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. వెస్టిండీస్ జట్టుపై సెహ్వాగ్ ఫైర్

స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. వెస్టిండీస్ జట్టుపై సెహ్వాగ్ ఫైర్

స్కాట్లాండ్ చేతిలో ఓటమి పాలవ్వడంతో వెస్టిండీస్ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ జట్టుకున్న పూర్వ వైభవాన్ని పోగొడుతున్నారంటూ ఆ జట్టు ఆటగాళ్లకు, ఆ దేశ క్రికెట్ బోర్డుకు.. మాజీ దిగ్గజ క్రికెటర్లు చురకలు అంటిస్తున్నారు. మీ ఆట చూశాక.. వివ్ రిచర్డ్స్, బ్రియన్ లారా, ఆంబ్రోస్, వాల్ష్, రాబర్ట్స్, క్లైవ్ లాయిడ్ వంటి ఆటగాళ్లు తలెత్తుకోగలరా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

తప్పక గెలవాల్సిన మ్యాచులో విండీస్ పేలవ ఆటతీరు కనపరిచింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌లో 181 పరుగులకే ఆలౌట్ కాగా.. అనంతరం బౌలింగ్‌లో పోరాడే ప్రయత్నం కూడా చేయకపోవటం గమనార్హం. విండీస్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని.. స్కాట్లాండ్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ చేధించారు. దీంతో 48 ఏళ్ల క్రితం క్రికెట్ చరిత్రలో తొలి ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్.. వన్డే ప్రపంచకప్‌‌కు  తొలిసారి అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఆ జట్టు ఆటగాళ్లకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చురకలు అంటించాడు.

"వెస్టిండీస్ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఎంత అవమానకరం. కేవలం ప్రతిభ చూపితే సరిపోదు. రాజకీయాలకు అతీతంగా క్రీడల నిర్వహణ ఉండాలి. ఇకనైనా ఆటపై ద్రుష్టి మరింత ద్రుష్టి పెట్టండి.." అంటూ సెహ్వాగ్.. వెస్టిండీస్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా, వన్డే ఫార్మాట్ లో 1975, 1979లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కరేబియన్ జట్టు.. 1983లో రన్నరప్‌గా నిలిచింది.