
- అత్యధిక జీతం రూ. 34.40 లక్షలు
హైదరాబాద్, వెలుగు : టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండటంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వీఐటీ–ఏపీ యూనివర్శిటీ ముందంజలో ఉందని ఛాన్స్లర్ డా. జీ విశ్వనాథన్ చెప్పారు. ఇక్కడున్న కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ (సీడీసీ) చురుగ్గా పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశంలోని పెద్ద కంపెనీలను సైతం క్యాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చేలా కృషి చేస్తోందని చెప్పారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సజావుగా జరిగేలా సీడీసీ చొరవ తీసుకుంటోందని ప్లేస్మెంట్ సెలబ్రేషన్స్‌లో అన్నారు.
రూరల్ స్టూడెంట్స్ కోసం సపోర్టెడ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్(స్టార్స్) పేరుతో ఒక ప్రోగ్రామ్‌ను వీఐటీ అమలు చేస్తున్నట్లు విశ్వనాథన్ వెల్లడించారు. 2023 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అద్భుతంగా సాగిందని, 1,021 మంది స్టూడెంట్లు ఉద్యోగాలు సంపాదించుకున్నారని వైస్ చాన్సలర్ డా. ఎస్ వీ కోటా రెడ్డి చెప్పారు. తమ స్టూడెంట్లకు మొత్తం 1,560 జాబ్ ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నారు. వీఐటీ–ఏపీ క్యాంపస్‌లోని ఒక స్టూడెంట్‌కు ఒక ఎంఎన్సీ నుంచి రూ. 34.4 లక్షల జీతంతో ఆఫర్ రావడం విశేషమని వెల్లడించారు. 2023 బ్యాచ్ యావరేజ్ శాలరీ కూడా బాగా పెరిగి రూ. 7.20 లక్షలకు చేరిందన్నారు. ఈ ఏడాది మొత్తం 900 మంది రిక్రూటర్లు క్యాంపస్‌కు వచ్చినట్లు చెప్పారు.