వాడేసిన టైర్లతో ఉద్గారాలు : విఎల్లెన్ మూర్తి

వాడేసిన టైర్లతో ఉద్గారాలు : విఎల్లెన్ మూర్తి

ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏడాది 150 కోట్ల వాడేసిన టైర్లను పారేస్తుంటారు. అంటే నిముషానికి 2,850 వాహనాల టైర్లు పాడవుతుంటాయి. గత 20 ఏండ్లుగా ప్రపంచంలోని వాడి పారేసిన టైర్లన్నిటిని డంపింగ్ యార్డ్​లో పడేస్తున్నారు. రబ్బరు టైర్లు బయోడిగ్రేడబుల్ వ్యర్థాలుగా పరిగణించబడవు. బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు సహజ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం, కుళ్ళిపోయి పర్యావరణానికి తిరిగి వచ్చే సేంద్రీయ పదార్థాలుగా నిర్వచించబడ్డాయి. రబ్బరు టైర్లు రబ్బరు, ఉక్కు వివిధ రసాయనాలు వంటి సింథటిక్ పదార్థాలతో తయారు చేయబడతాయి. ఇవి సహజ వాతావరణంలో సులభంగా విచ్ఛిన్నం కావు. రబ్బరు టైర్లను కుళ్ళిపోయే ప్రక్రియ పరిస్థితులపై ఆధారపడి దశాబ్దాలు లేదా శతాబ్దాలు కూడా పట్టవచ్చు.  వేటినైన రీసైకిల్ చేయవచ్చు గానీ,  టైర్లను మాత్రం కరగపెట్టలేం. ఒక వేళ కరగపెట్టాలని చూసినా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో నిల్వ చేసినప్పుడు టైర్లు కూడా అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ ప్రదేశాన్ని టైర్ల శ్మశానంగా పిలుస్తుంటారు.

 
భారత్​లో  పెరుగుతున్నాయి

ఆటోమొబైల్ రంగంలో భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆటో మార్కెట్​గా అవతరించింది. జపాన్ ను వెనక్కి నెట్టి మూడవ ప్లేస్ లోకి దూసుకొచ్చింది.    దీనికి తోడు ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వాడేసిన టైర్లు యూకే, ఆస్ట్రేలియా, యూఏఈల నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి రోజూ ఇండియాలో 2.75 లక్షల వాడేసిన టైర్లు పుట్టుకొస్తున్నాయి.  టైర్లతో పైరోలిసిస్ ఆయిల్ భారత్​లో ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని సిమెంట్,  పింగాణీ తదితర కర్మాగారాల్లో ఇంధనంగా వినియోగిస్తున్నారు. పైరో లిసిస్ ఆయిల్  కోసం టైర్లను మండించడం వల్ల పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. టైర్లు, రబ్బర్ల పున:శ్శుద్ధి సంఘం (టీఆర్ఎస్ఏఐ) లెక్కల ప్రకారం భారత్ లో 800 నమోదైన టైర్ల పున:శుద్ధి కేంద్రాలున్నాయి. చాలా ప్లాంట్లు ఉత్తరప్రదేశ్, హర్యానాలలో నెలకొన్నాయి.  దేశవ్యాప్తంగా 46 శాతం పైరోలిసిస్ ప్లాంట్లే కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నాయని రెండేళ్ల క్రితం సీపీసీబీ నివేదిక వెల్లడించింది. 19 రాష్ట్రాల్లో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కిన 270 పైరోలిసిస్ ఆయిల్ తయారీ కేంద్రాలను మూసివేయాలని 2019లో కేంద్ర కాలుష్య నియం త్రణ మండలి (సీపీసీబీ) ఆదేశించింది. టైరు వ్యర్థాల నిర్వహణకు సంబంధించి భారత్​లో సరైన ప్రణాళిక లేదని అదే ఏడాది జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్టీటీ) ఆవేదన వ్యక్తం చేసింది. 

విదేశీ వృథా టైర్ల దిగుమతులను నియంత్రించాలి

 దేశీయంగా వృథా టైర్ల సమస్య పరిష్కారానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఒక నిపుణుల కమిటీని వేసింది. ఈ కమిటీ సూచన మేరకు వృథా టైర్లను ఆయా తయారీ సంస్థలు, దిగుమతిదారులే పున:శ్శుద్ధి చేయాలని నిబంధనలు విధించింది. 2020–-21లో తయారు చేసిన, దిగుమతి అయిన టైర్లను 2025 నాటికి వందశాతం పున:శుద్ధి చేయాలని సూచించింది.  టైర్ల పున:శుద్ధి కేంద్రాలతో ఆయా సంస్థలు, దిగుమతిదారులు ఒప్పందాలు చేసు కోవాలి. ఇవి సక్రమంగా అమలవుతున్న దాఖలాలు లేవు. తప్పనిసరిగా ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. విదేశాల నుంచి  వృథా టైర్ల దిగుమతు లనూ నియంత్రించాలి.

ఇతర వస్తువులు తయారు చేయొచ్చు

వాడేసిన టైర్లతో కన్వేయర్ బెల్టులు, డోర్ మ్యాట్లు, షూ లేసులు, రబ్బరు షీట్లు, హోస్ పైపులు తదితరాలు తయారు చేయవచ్చు, భవనాలు, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిచుమన్​ను ఏటా ఎనిమిది లక్షల టన్నుల మేర దిగుమతి చేసుకుంటున్నాం. టైర్లను పలు రసాయన చర్యలకు గురిచేయడం ద్వారా వచ్చే పదార్ధాన్ని బిచుమన్​లో  కలపడం ద్వారా వృథా టైర్ల సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. దేశీయంగా టైర్లు, రబ్బర్ల పున:శ్శుద్ధి పరిశ్రమ విలువ ప్రసుత్తం రూ.3,500 కోట్లు. వాహనాలు పెరుగుతున్నందువల్ల రాబోయే రోజుల్లో ఇది మరింతగా వృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమలన్నీ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించేలా పాలకులు సరైన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమల్ని మూసివేయించాలి.   

- తరిగొప్పుల 
విఎల్లెన్ మూర్తి
ఫ్రీలాన్స్ రైటర్.

 

  • Beta
Beta feature