600 ఏండ్ల తర్వాత రష్యాలో పేలిన అగ్నిపర్వతం..

 600 ఏండ్ల తర్వాత రష్యాలో పేలిన అగ్నిపర్వతం..
  • రష్యాలో మరో భూకంపం.. బద్దలైన అగ్నిపర్వతం
  • కురిల్ దీవుల్లో 7.0 తీవ్రతతో భూప్రకంపనలు
  •  ఊగిపోయిన భవనాలు.. భయంతో జనం పరుగులు
  •  సునామీ హెచ్చరికలు జారీ
  •  600 ఏండ్ల తర్వాత పేలిన క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం
  •  6 వేల మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన బూడిద

మాస్కో:  రష్యాను మూడు రోజుల వ్యవధిలోనే మరో భారీ భూకంపం కుదిపేసింది. కురిల్ దీవుల్లో ఆదివారం రిక్టర్ స్కేల్‌‌‌‌పై 7.0 తీవ్రతతో భూమి కంపించింది. రష్యా కమ్చట్కాలోని మూడు ప్రాంతాల్లో సునామీ సంభవించే అవకాశం ఉందని రష్యా  అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీచేసింది.  అంచనా వేసిన అలల ఎత్తు తక్కువగా ఉన్నా.. తీర ప్రాంత ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని  టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌‌‌‌లో సూచించింది.  భూకంపం ప్రభావంతో   ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇప్పటివరకూ తెలియలేదు. భూకంపం ధాటికి పలు నగరాల్లోని భవనాలు ఊగిపోయాయని రష్యా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  ప్రజలు భయభ్రాంతులకు గురై.. ఇండ్ల నుంచి పరుగులు తీశారు. కాగా, కురిల్ దీవులు కమ్చట్కా ద్వీపకల్పం  దక్షిణ కొన నుంచి విస్తరించి ఉన్నాయి. రాబోయే కొన్ని వారాల్లో ఈ ప్రాంతంలో బలమైన ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని రష్యన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇటీవల రష్యా తీరంలో భారీ భూకంపం  సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌‌‌‌పై 8.8 తీవ్రతతో భూమి కంపించగా.. దీని ధాటికి రష్యా, జపాన్‌‌‌‌తో పాటు ఉత్తర పసిఫిక్‌‌‌‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ  తాకింది. దీని ప్రభావంతోనే తాజా భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

600 ఏండ్లకు బద్ధలైన అగ్ని పర్వతం

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని  క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాదాపు 600 ఏండ్ల తర్వాత బద్ధలైంది. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం  చివరిసారిగా 1425వ సంవత్సరంలో  జరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటీవల సంభవించిన భారీ భూకంపం ప్రభావం వల్లే  ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడినట్లు పేర్కొన్నది. అగ్నిపర్వతం 1,856 మీటర్ల ఎత్తులో ఉన్నదని, బూడిద మేఘం తూర్పు, పసిఫిక్ మహాసముద్రం వైపు మళ్లిందని, ఆ మార్గంలో ఎలాంటి  జనసాంద్రత ప్రాంతాలు లేవని వెల్లడించింది. అలాగే, కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతం క్ల్యూచెస్కీ బద్ధలైనట్టు పేర్కొన్నది.