- ఓట్ల చోరీపై పోరాటం కొనసాగిస్తాం
- ఎన్నికల ప్రక్రియలో ఈసీ ఫెయిల్ అయిందని ఫైర్
న్యూఢిల్లీ: ఒక వ్యక్తికి ఒకే ఓటు నిబంధనను అమలు చేయడంలో ఎన్నికల సంఘం(ఈసీ) విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటర్ల జాబితాలో దేశవ్యాప్తంగా అక్రమాలు జరిగాయని మరోసారి ఆరోపించారు. ఓటరు జాబితాలో అక్రమాలను బయటపెడుతూ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై మాట్లాడుతూ.. సిన్మా ఇంకా అయిపోలేదని, ‘అభీ పిక్చర్ బాకీ హై’ అని అన్నారు.
ప్రస్తుతం దేశంలో రాజ్యాంగాన్ని కాపాడే పనిలో ఉన్నామని, దాన్ని కొనసాగిస్తామన్నారు. మంగళవారం పార్లమెంట్హౌస్ కాంప్లెక్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కర్నాటక, మహారాష్ట్రలో బీజేపీతో కలిసి ఓట్లు చోరీ చేసిన ఎన్నికల కమిషన్.. ఈ ఏడాది చివరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి సిద్ధమవుతున్నదన్నారు.
ఓట్ల చోరీ వివాదంపై విపక్షాల నిరసనను ‘టీజర్’గా రాహుల్ అన్నారు. ‘‘ఇది ఒక్క సీటు విషయం కాదు, అనేక సీట్లలో ఓటు చోరీ జరిగింది. ఇది జాతీయ స్థాయిలో, వ్యవస్థాగతంగా జరుగుతోంది. ఈసీకి ఇది తెలుసు, మాకూ తెలుసు’’ అని రాహుల్ తెలిపారు.
‘గతంలో ఆధారాలు లేవు, కానీ ఇప్పుడు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒకే ఓటు అని రాజ్యాంగంలో ఉంది. ఈసీ దీనిని అమలు చేయడంలో విఫలమైంది’ అని ఆరోపించారు. బిహార్‌లోని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో 124 ఏండ్ల వయస్సు గల మింతా దేవి అనే ఓటరు పేరుపై ప్రశ్నకు సమాధానం ఇస్తూ .. ‘ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి..’ అని రాహుల్ సమాధానమిచ్చారు.
