లోకల్​ ఓటు మస్తు రేటు

లోకల్​ ఓటు మస్తు రేటు

నెట్​వర్క్​, వెలుగు: లోకల్​బాడీ​ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరసారాలు జోరందుకున్నాయి. అధికార పార్టీ వందల కోట్లు పంచిందని ఊరూవాడా ప్రచారమైన హుజూరాబాద్ ​బై పోల్ తర్వాత వచ్చిన ఎలక్షన్లు కావడంతో ఒక్కో ఓటు ఏకంగా రూ.5 లక్షలు పలుకుతున్నదని అంటున్నరు. ఎలక్షన్స్ జరుగుతున్న12 చోట్లా తమకే మెజారిటీ ఉన్నందున అన్నీ ఈజీగా ఏకగ్రీవం చేసుకుంటామని ధీమాతో ఉన్న రూలింగ్​ టీఆర్ఎస్ లెక్కలు తప్పాయి. ఆ పార్టీ లీడర్లే పలుచోట్ల ఇండిపెండెంట్లుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫోరం​తరఫున రెబల్స్​గా రంగంలోకి దిగి అఫీషియల్ క్యాండిడేట్లకు చుక్కలు చూపిస్తున్నరు. నామినేషన్లు రూల్స్ ప్రకారం లెవ్వని కొందరిని, ఫోర్జరీ సంతకాలని ఇంకొందరిని బుధవారం స్క్రూటినీలో ఎలాగోలా తప్పించినా చాలాచోట్ల పోటీ తప్పడం లేదు. నల్గొండ, మెదక్​లాంటి చోట్ల కాంగ్రెస్​ నుంచి బలమైన లీడర్లు బరిలో ఉండటంతో క్రాస్​ ఓటింగ్​ భయమూ టీఆర్ఎస్ ను వెంటాడుతున్నది. దాంతో చాలాచోట్ల ఇప్పట్నుంచే క్యాంపు రాజకీయాలు కూడా షురువయ్యాయి. ఆ ఖర్చు కూడా రూలింగ్​పార్టీ క్యాండేట్ల నెత్తిన్నే పడబోతున్నది. రెండున్నర వారాల పాటు దీన్ని ఎట్ల భరించడమా అని వాళ్లంతా ఇప్పట్నుంచే బుగులు పడుతున్నరని టీఆర్ఎస్ లో టాక్ నడుస్తున్నది.

డిమాండ్లను పట్టించుకోక...

లోకల్ బాడీస్​ కోటాలో 9  జిల్లాల్లోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు16వ తేదీన నోటిఫికేషన్ రాగానే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రంగంలోకి దిగారు. ఫోరం తరఫున బయటికొచ్చిన ప్రతినిధులు తమకు ఫండ్స్, పవర్స్​పై క్లారిటీ ఇవ్వాలని, లేదంటే పోటీకి దిగుతామని రూలింగ్ పార్టీకి అల్టిమేటమిచ్చారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసినా హామీ రాకపోవడంతో అన్ని చోట్లా ఫోరం తరఫున టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. దాంతో, ఏకగ్రీవమనుకున్నవి కాస్తా 12 స్థానాల్లో ఏకంగా 93 నామినేషన్లు పడ్డాయి. దీంతో పోటీ తప్పడం లేదు. టీఆర్ఎస్ హైకమాండ్​ఆయా జిల్లాల మినిస్టర్లను అలర్ట్​ చేసింది. రెబల్స్ తో ఏదోలా విత్​డ్రా చేయించేందుకు ఇప్పుడు వాళ్లంతా నానాతంటాలు పడుతున్నారు. మహబూబ్​నగర్​లో 10 మంది నామినేషన్లు వేయగా స్క్రూటినీలో ఆరుగురిని పలు రీజన్లతో రిజెక్ట్ ​చేశారు. మిగిలిన ఇద్దరు ఇండిపెండెంట్లలో ఒక్కొక్కరికి ఏకంగా రూ.కోటికి పైనే ముట్టినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో ఒకరు బుధవారమే విత్​డ్రా చేసుకోగా, రెండో క్యాండేట్​గురువారం తప్పుకుంటాడని సమాచారం. అదే జరిగితే రెండు సీట్లూ  ఏకగ్రీవమవుతాయి.

ఇలా తప్పకుకోవడానికి ఒప్పుకోని చోట్లలో రూలింగ్​పార్టీ లీడర్లు బేరసారాలకు దిగుతున్నారు. కరీంనగర్​లో క్యాంపుకు దూరంగా ఉండిపోయిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను రప్పించేందుకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలకు పైగా ఆఫర్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. క్యాంపులకు వచ్చినోళ్లు కూడా రూ.5 లక్షలకు పైగా డిమాండ్​చేస్తున్నట్లు తెలిసింది. ‘‘హుజూరాబాద్​లో గెలుస్తానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన్రు. నార్మల్ ఓటర్లకే ఒక్కొక్కరికి 10 వేల చొప్పున పంచిన్రు. మాకు 5 లక్షలిస్తే తప్పేంది?” అని ఓ లీడర్‌తో  అన్నట్లు తెలిసింది. హుజూరాబాద్ బై పోల్ ఎమ్మెల్సీ ఓటు రేటును కూడా పెంచేసిందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. 

క్యాంపుల కాలం...
కరీంనగర్​నుంచి 27 నామినేషన్లు వచ్చాయి. స్క్రూటినీలో ముగ్గురిని తప్పించినా 24 మంది బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ​మాజీ మేయర్​సర్దార్​రవీందర్​సింగ్, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి లాంటి లీడర్లు రెబల్స్ గా పోటీ చేస్తుండటంతో లోకల్ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అలర్టయ్యారు. అందుబాటులో ఉన్న ఓటర్లను మంగళవారమే 60 ఆర్టీసీ  బస్సుల్లో హైదరాబాద్‍ శివారులోని రిసార్టుకు తరలించారు. అయినా చాలామంది ఎంపీటీసీలు,  జడ్పీటీసీలు ఫోన్లు స్విచాఫ్​పెట్టి క్యాంపులకు డుమ్మా కొట్టారు. బుజ్జగించేందుకు మినిస్టర్లు తంటాలు పడుతున్నట్టు తెలిసింది.  నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనచరుడు, నల్గొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య,  ఆలేరు మాజీ ఎమ్మె ల్యే, జడ్పీటీసీ కుడుదల నగేశ్ తదితరులు పోటీలో ఉన్నారు. దాంతో టీఆర్ఎస్​ను క్రాస్​ఓటింగ్​భయం వెంటాడుతోంది. ఎందుకైనా మంచిదని తమ ఓటర్లను క్యాంపులకు తరలించాలని మంత్రి జగదీశ్​రెడ్డి ప్లాన్​చేస్తున్నారు. వరంగల్​లో ముగ్గురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. వాళ్లకు టీఆర్ఎస్ క్యాండిడేట్ క్యాష్​ఆఫర్​చేయడంతో పాటు, క్యాంపులు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. 

మెదక్‌లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య, సంగారెడ్డి డీసీసీ చీఫ్ నిర్మల బరిలో ఉన్నారు.ఈమెతోపాటు రూలింగ్​పార్టీ నుంచి ముగ్గురు రెబల్స్‌గా దిగారు. దాంతో తమ పార్టీలోని అసంతృప్తులను జగ్గారెడ్డి లాగే ప్రమాదముందని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు.​ ఎవరూ చేజారకుండా అందర్నీ క్యాంపులకు తరలించే ప్లాన్లో ఉన్నారు.  ఖమ్మంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాండిడేట్లకు తోడు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. వీరిలో ఒకరు పంచాయతీ రాజ్ ఫోరం జిల్లా కన్వీనర్ కావడంతో పోటీ గట్టిగానే ఉంది. ఇక్కడా క్యాంపు తప్పేలా లేదు. ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ క్యాండిడేట్ గా అంతగా తెలియని విఠల్ పేరును ప్రకటించడంతో పార్టీలోని లోకల్ లీడర్లు నారాజయ్యారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ అనుచరులు పార్టీ తీరుకు వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక్కడ 24  నామినేషన్లు పడ్డాయి. టీఆర్ఎస్ ​లీడర్లే ఇలా తమవాళ్లతో నామినేషన్లు వేయించడంతో మంత్రి ఇంద్రకరణ్ రంగంలోకి దిగారు. ఓటర్లను క్యాంపులకు తరలించేందుకు హైదరాబాద్,  మహారాష్ట్రలో రిసార్టులను బుక్ ​చేశారని చెప్తున్నారు.