ఇక పంచాయతీల్లో ఓట్ల పండుగ.. వచ్చే నెలలో ఎన్నికలు

ఇక పంచాయతీల్లో ఓట్ల పండుగ.. వచ్చే నెలలో ఎన్నికలు
  • రెడీగా ఉండాలని ఆఫీసర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు​
  • నెలాఖరులోగా పీవో, ఏపీవోల నియామకానికి చర్యలు​
  • జిల్లాల్లో ఆఫీసర్ల హడావుడి
  • జీపీలు, రిజర్వేషన్ల వివరాల సేకరణ

యాదాద్రి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో గ్రామ పంచాయతీ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండడంతో జనవరిలో ఎన్నికలకు రెడీగా ఉండాలని స్టేట్​ఎలక్షన్​కమిషన్​ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వం గురువారం కొలువుదీరబోతోంది. కొత్త సర్కారు ఏర్పాటవుతున్నందున షెడ్యూల్​ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? లేదంటే ఆలస్యమయ్యే అవకాశం ఉందా? అన్న చర్చ మొదలైంది.  

ఫిబ్రవరి 1తో ముగియనున్న గడువు

2018లో డిసెంబర్​లో అసెంబ్లీ  ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 జనవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.  ఆ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్​ మద్దతుదారులే ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. ఈ సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది.  తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఓడిపోయి కాంగ్రెస్​అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈ నెల 4న పంచాయతీ ఎన్నికలకు రెడీగా ఉండాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీల్లోని పోలింగ్​సెంటర్లకు ప్రిసైడింగ్​ఆఫీసర్లు, అసిస్టెంట్​ప్రిసైడింగ్​ఆఫీసర్లను నియమించాలని ఆదేశించింది.

ఒక్కో పీఎస్​కు ఒక్కొక్కరు

ఎన్నికల కమిషన్​ఆదేశాల ప్రకారం పంచాయతీల్లోని ఒక్కో వార్డులోని పోలింగ్​స్టేషన్​కు ఒక్కో ప్రిసైడింగ్​ఆఫీసర్​తో పాటు అసిస్టెంట్​ను నియమించాల్సి ఉంటుంది. 200 ఓట్లున్న వార్డుకు ప్రిసైడింగ్​ఆఫీసర్​తో పాటు అసిస్టెంట్​ను నియమిస్తారు. 400 ఓట్లలోపు ఉండే పోలింగ్​స్టేషన్​కు ప్రిసైడింగ్​ఆఫీసర్​తో పాటు ఇద్దరు అసిస్టెంట్లు, 650 ఓటర్లలోపు ఉంటే ప్రిసైడింగ్​ఆఫీసర్​తో పాటు ముగ్గురు అసిస్టెంట్లను నియమించాల్సి ఉంటుంది. అంతకు మించి ఓటర్లుంటే రెండో పోలింగ్​సెంటర్​ఏర్పాటు చేయాలి. వీటి కోసం పోలింగ్​సెంటర్ల వారీగా అవసరమైన ప్రిసైడింగ్​ఆఫీసర్లతో పాటు అదనంగా 20 శాతం స్టాఫ్​ను నియమించాలని ఎన్నికల కమిషన్​ ఆదేశించింది. ప్రిసైడింగ్​ఆఫీసర్లకు సంబంధించిన పూర్తి సమాచారం సిద్ధం చేయాలని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రిసైడింగ్​ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వారిని పంచాయతీ ఎన్నికల కోసం ఉపయోగించుకోనున్నారు.

మూడు దశల్లో ఎన్నికలు

రాష్ట్రంలోని 594 రెవెన్యూ మండలాల పరిధిలో 12,769 గ్రామ పంచాయతీలున్నాయి. సంఖ్య ఎక్కువగా ఉన్నందున గతంలో మాదిరే మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని పంచాయతీలను మూడు భాగాలుగా విభజించి..ఫేజ్​ల వారీగా లిస్టులు రూపొందించే పనిని ఆఫీసర్లు ప్రారంభించనున్నారు. మొదటి దశ ఎన్నికల్లో బాధ్యతలు నిర్వర్తించిన ప్రిసైడింగ్​, అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ఆఫీసర్లకు మూడో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించే అవకాశాలు ఉన్నాయి.

వివరాల సేకరణలో బిజీ

ఎన్నికల కమిషన్​ఆదేశాలతో పంచాయతీలకు సంబంధించిన వివరాలను సేకరించడంలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ఇప్పటికే పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్​తో పాటు వార్డుల రిజర్వేషన్ల వివరాలు సిద్ధం చేశారు. వీటితో పాటు గత ఎన్నికల్లో ఖర్చు వివరాలు వెల్లడించని వారిపై పోటీ చేయకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధం విధించిన వారి పూర్తి వివరాలను కూడా రెడీ చేస్తున్నారు. దీంతో పాటు ఇటీవలే కొత్త పంచాయతీల ఏర్పాటు కోసం గత ప్రభుత్వానికి పంపిన ప్రపోజల్స్​ను సైతం పంపించనున్నారు.

షెడ్యూల్​ ప్రకారం ఎన్నికలు జరిగేనా?

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 23 నుంచి 42కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ ప్రాసెస్​ పూర్తి కావడానికి టైం పట్టే అవకాశం ఉన్నందున, ఇంత తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు సర్పంచులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్​కు చెందిన వారే ఉండడంతో కొత్త ప్రభుత్వం షెడ్యూల్​ప్రకారమే ఎన్నికల నిర్వహణకు వెళ్తుందని కొంతమంది సర్పంచులు అంటున్నారు. మరోవైపు వైఎస్​హయాంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏడాదిన్నర పొడిగింపు ఇచ్చారని, ఇప్పుడు అలాగే చేసి రిజర్వేషన్ల ప్రక్రియ ముగిశాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉండొచ్చని మరికొందరు వాదిస్తున్నారు.