అచ్చంపేట/ అమ్రాబాద్, వెలుగు : రూ.వంద కోట్లకు అచ్చంపేట ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ యత్నించి అడ్డంగా దొరికాడని, కల్ల బొల్లి మాటలు చెబుతూ ఈ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆదివారం రాత్రి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో వాల్ పోస్టర్లు వెలిశాయి. పలువురిపై దాడులు చేస్తున్నాడని, స్థానికేతరుడైన గువ్వల బాల్ రాజ్‌ను నియోజకవర్గ పొలిమేరల నుంచి తరిమి కొట్టాలని అందులో పిలుపునిచ్చారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు, పోలీసులు వాటిని తొలగించారు. కాంగ్రెస్ లీడర్లే ఈ పోస్టర్లు అతికించారని, వారికి తగిన గుణపాఠం చెబుతామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. దీనిపై అచ్చంపేట, లింగాల, బల్మూర్, ఉప్పునుంతల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు అచ్చంపేట సీఐ అనుదీప్ తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
పోస్టర్ల వ్యవహారంలో నిందితులను అరెస్ట్ చేశామని అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల నాయకులు సయ్యద్ బాబా, వెంకటేశ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గోడ లపై పోస్టర్లు అతికిస్తుండగా పెట్రోలింగ్ లో ఉన్న ట్రైనీ ఎస్సై శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా అమ్రాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ లీడర్లయిన ఖైరత్, శివ, అచ్చంపేట మండలం బొమ్మనపల్లి కి చెందిన అజయ్ ఇందులో సంబంధం ఉందని చెప్పారన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని, వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.
