వనపర్తి జిల్లాలో ఇన్​చార్జీల పాలన..జిల్లా, మండల స్థాయి ఆఫీసర్లు లేక జనం తిప్పలు

వనపర్తి జిల్లాలో ఇన్​చార్జీల పాలన..జిల్లా, మండల స్థాయి ఆఫీసర్లు లేక జనం తిప్పలు

వనపర్తి టౌన్, వెలుగు: చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువ చేశామని చెబుతున్న ప్రభుత్వం జిల్లా ఆఫీసర్ల పోస్టులను ఇన్​చార్జీలతో నెట్టుకొస్తోంది. దీంతో రెండు జిల్లాల్లో పని చేయలేక ఆఫీసర్లు, సకాలంలో పనులు కాక ప్రజలు తిప్పలు పడుతున్నారు. వనపర్తి జిల్లాలోని పలు శాఖలకు ఇంచార్జీలే దిక్కయ్యారు. లోకల్ బాడీస్  అడిషనల్​ కలెక్టర్ గా పని చేసిన ఆశీష్​ సంగ్వాన్ బదిలీ కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. మరో అడిషనల్​ కలెక్టర్  వేణుగోపాల్ 
ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని డీఈవో, ఇండస్ట్రియల్  ఆఫీసర్, ఫుడ్ ఇన్స్​పెక్టర్, లైబ్రేరియన్, డీఎంహెచ్ వో, బీసీ, మైనార్టీ వెల్ఫేర్​ ఆఫీసర్లు, ఐసీడీఎస్, కమర్షియల్  టాక్స్  ఆఫీసర్, గ్రౌండ్  వాటర్, వెటర్నరీ, ఇరిగేషన్  శాఖలతో పాటు మరిన్ని శాఖల్లో ఇన్​చార్జీల పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మైనార్టీ, బీసీ వెల్ఫేర్  ఇన్​చార్జీ ఆఫీసర్​గా వనపర్తి ఆర్డీవో పద్మావతి వ్యవహరిస్తున్నారు. ఆర్డీవోగా ఆమె క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఫుడ్  ఇన్ స్పెక్టర్  నీలిమ కూడా ఇన్​చార్జీ కావడంతో ఆమె పూర్తి సమయం కేటాయించడం లేదు. జిల్లాలో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటళ్లు, కిరాణా దుకాణాలు, మిల్క్ సెంటర్లు, ఐస్ క్రీం పార్లర్లు, టీ కొట్లు, జ్యూస్ సెంటర్లలో ఏదోరకంగా ఆహారం కల్తీ అవుతోంది. దీనిపై దృష్టి పెట్టకపోవడంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఇటీవల ఓ జ్యూస్  సెంటర్ లో పండ్ల రసం తాగిన మహిళ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

మొక్కుబడి పర్యవేక్షణ.. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ డీఈవోకు అదనంగా నారాయణపేట ఇన్​చార్జీ బాధ్యతలు అప్పగించడం, నాగర్ కర్నూల్   డీఈవోకు వనపర్తి జిల్లా బాధ్యతలు అదనంగా అప్పగించడంతో విద్యావ్యవస్థ అధ్వానంగా మారుతోంది. ఇన్​చార్జి బాధ్యతలతో డీఈవోలు ఏ జిల్లాలోనూ సరిగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. ఇది ప్రైవేట్  స్కూళ్లకు వరంగా మారింది. ఇన్​చార్జి బాధ్యతలతో ఎప్పుడో ఓసారి చుట్టపు చూపుగా డీఈవో ఆఫీసుకు రావడం ఫైళ్ల మీద సంతకాలు పెట్టడానికే పరిమితం కావడంతో ఆఫీసుల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. సిబ్బంది, కింది స్థాయి ఆఫీసర్లలో జవాబుదారీతనం కరువవుతోందని అంటున్నారు. వనపర్తి జిల్లాలో 14 మండలాలు ఉండగా, ఒకే రెగ్యులర్  ఎంఈవో ఉండడం, మిగిలిన అన్ని మండలాల్లో హైస్కూళ్లలో పని చేసే గెజిటెడ్  హెచ్ఎంలకే ఇన్​చార్జి ఎంఈవో బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో అనేక మంది గెజిటెడ్​ హెచ్ఎంలకు 2 నుంచి 3 మండలాలకు ఎంఈవో బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో స్కూళ్ల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే జరుగుతోంది. 2 లేదా 3 మండలాల బాధ్యతలు అప్పగించడంతో ఏ మండలంలోనూ సరిగా డ్యూటీలు చేయకుండా కొందరు హెచ్ఎంలు తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.