V6 News

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి : చౌహాన్  

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి : చౌహాన్  
  • గద్వాల జోన్​ డీఐజీ ఎల్ఎస్​ చౌహాన్

వనపర్తి/నాగర్​కర్నూల్​ టౌన్, వెలుగు: పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పని చేయాలని జోగులాంబ జోన్  డీఐజీ ఎల్ఎస్  చౌహాన్  సూచించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి, నాగర్​కర్నూల్​లో ఎస్పీలు, పోలీస్​ ఆఫీసర్లతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ  ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని, డబ్బు, మద్యం ఇతరత్రా వస్తువులు అక్రమంగా రవాణా కాకుండా చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు.

శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరం మేరకు పోలీస్  సిబ్బందిని ఏర్పాటు చేసి నిఘా పెంచాలని సూచించారు. సాయుధ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి సక్రమంగా వినియోగించుకోవాలని, ఎన్నికల్లో సమస్యలు సృష్టించే వారిని బైండోవర్  చేయాలని ఆదేశించారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఫ్లాగ్  మార్చ్  నిర్వహించాలని సూచించారు.

30 పోలీస్  యాక్ట్  అమలు చేయాలని, గ్రామాల్లో పర్యటించి ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ సునీత రెడ్డి, సంగ్రామ్​సింగ్, నాగర్​కర్నూల్​ అడిషనల్​ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు, వనపర్తి ఏఆర్  ఏఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్  పాల్గొన్నారు.