వనపర్తి, వెలుగు: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేసేలా చూడాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం వనపర్తి మండలం చందాపూర్, చిట్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, విడతల వారీగా చెల్లింపులు చేస్తారని, ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
హౌజింగ్ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని, పెండింగ్ సమస్యలు ఉంటే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి మ్యాథ్స్‌లో వచ్చిన మార్కులు, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ గురించి ఆరా తీశారు. మ్యాథ్స్‌లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. డీఈవో అబ్దుల్ ఘని, హౌజింగ్ డీఈ విఠోబా, తహసీల్దార్ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.
కొత్తకోట ఏపీవోకు షోకాజ్ నోటీస్..
ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈ కేవైసీ నిర్వహించడంలో వెనుకబడిన కొత్తకోట ఏపీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలందరికీ ఈకేవైసీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్లో డీఆర్డీవో ఉమాదేవితో కలిసి అన్ని మండలాల ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే సోమవారం నాటికి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పీఆర్ ఈఈ మల్లయ్య, డీపీవో రఘునాథ్ పాల్గొన్నారు.
