వనపర్తి, వెలుగు: ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణకు ఎన్నికల సాధారణ పరిశీలకుడు మల్లయ్య భట్టు, వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ తో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలన చేయడమే కీలకమని, పీవోలు, ఏపీవోల విధుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదా లేదా అని పరిశీలించాలని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఉదయం 6 గంటల కల్లా నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ఎన్నికల సాధారణ పరిశీలకుడు మల్లయ్య బట్టు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల కమిషన్ తరఫున కళ్లూ, చెవుల లాగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఏడీసీ యాదయ్య, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, ట్రైనర్ శ్రీనివాసులు, జడ్పీ డిప్యూటీ సీఈవో రామమహేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
