వనపర్తి, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకున్న ఇన్చార్జీ లు, ఆపరేటర్లు మాత్రమే కనిపించాలని, వేరే వ్యక్తులు ఉండడానికి వీల్లేదని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. గురువారం చిన్నంబావి మండలం దగడపల్లి రైతు వేదికలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు.
ఎఫ్ఏక్యూ ప్రమాణాల ప్రకారం సన్న, దొడ్డు రకం వడ్లను గుర్తించేలా అవగాహన కలిగి ఉండాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చిన వెంటనే తేమ శాతం వివరాలు రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. శిక్షణపై ఆసక్తి లేని వారికి కేంద్రాలను కేటాయించవద్దన్నారు. వర్షాలు వస్తే ఇబ్బందులు లేకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, హార్వెస్టర్లతో మాట్లాడి పంటను సరైన సమయంలో కోతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం చిన్నంబావి తహసీల్దార్ ఆఫీస్ కోసం స్థలాన్ని పరిశీలించారు. సాగునీటి కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తున్న అడ్డుకట్టల సమస్యను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే తొలగించాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. డీఏవో ఆంజనేయులు గౌడ్, డీఎస్వో కాశీ విశ్వనాధ్, డీసీవో రాణి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాలేజీల్లో పనులు స్పీడప్ చేయాలి
వనపర్తి టౌన్: జిల్లాలోని అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, రిపేర్ల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. జూనియర్ కాలేజీల్లో సౌలతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని, వాటిని సకాలంలో ఖర్చు చేసి ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాక ముందే పనులు ప్రారంభించాలని సూచించారు.
ఇంటర్ స్టూడెంట్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కృషి చేయాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ పెంపొందించాలన్నారు. ఇంటర్ పరీక్షల్లో ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించేలా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. డీఐఈవో అంజయ్య, డీఈవో అబ్దుల్ ఘని, డీఎంహెచ్ వో శ్రీనివాసులు పాల్గొన్నారు.
