
వనపర్తి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ హెచ్చరించారు. సోమవారం తన ఛాంబర్లో జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లతో సమావేశం నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్ల ముద్రణలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. పోస్టర్లు, కరపత్రాల్లో ఎక్కడా కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించవద్దని, వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
పబ్లిషర్ నుంచి ఫారం–ఏలో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం–ఏ, బితో పాటు ముద్రించిన 4 కరపత్రాలను మండల కార్యాలయానికి లేదంటే కలెక్టరేట్ కు పంపించాలని సూచించారు. ముద్రించిన కరపత్రం లేదా పోస్టర్‌పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, ఎన్ని పేజీలు ముద్రించారనే విషయాన్ని తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. డీపీఆర్వోసీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్ పాల్గొన్నారు.