
- రవాణాకు సరిపడా లారీలకు సమకూర్చని ఏడు ఏజెన్సీలు..
- రివ్యూలో అనుమానాలు వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
- రెండు వారాలుగా పేరుకుపోయిన లారీలు
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో రైతులు అరిగోస పడుతున్నారు. దాదాపు 15 రోజులుగా సెంటర్లకు తీసుకొచ్చిన వడ్లను కాంటా చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ప్రధానంగా లారీల ఏజెన్సీలు సరిపడా వాహనాలను సమకూర్చకపోవడం, హమాలీల సమస్య తీవ్రంగా ఉండటంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి.
లారీ ఏజెన్సీలపై మంత్రి సీరియస్
వనపర్తి జిల్లాలో ఈ యాసంగిలో 3.90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని సివిల్సఫ్లయ్ఆఫీసర్లు టార్గెట్పెట్టుకున్నారు. బుధవారం వరకు 1.90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను రైతుల నుంచి సేకరించారు. ఇంకా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించాల్సి ఉంది. దాదాపు 15 రోజులుగా జిల్లాలోని గోపాల్ పేట, రేవల్లి, పాన్‌గల్, వీపనగండ్ల, మదనాపురం మండలాల్లోని కొన్ని సెంటర్ల వద్ద కొనుగోళ్లు లేట్అవుతున్నాయి. వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీలు రోజులు తరబడి తిరిగి రాకపోవడంతో సెంటర్ల నిర్వాహకులు కాంటాలు వేయడం లేదు. నాలుగు రోజులుగా ఆయా సెంటర్ల పరిధిలో రైతులు వడ్లను కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగారు.
విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ ఆయా ప్రాంతాల్లోని సెంటర్లను పరిశీలించారు. కొనుగోళ్ల అంశంపై ఇటీవల ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. వడ్ల కొనుగోళ్లు ఆలస్యంపై సమీక్షలో ఆరా తీశారు. సెంటర్ల వద్దకు లారీలు ఎందుకు టైంకు రావడం లేదని ప్రశ్నించారు. వెంటనే లారీల ఏజెన్సీలతో మాట్లాడాలని, కలెక్టరేట్‌కు లారీలను తీసుకొచ్చి ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాలను తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. కానీ ఏజెన్సీలు మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేశాయి.
మంత్రి చెప్పినా పట్టించుకోని ఏజెన్సీలు
వాస్తవానికి జిల్లాలో 370 సెంటర్లు ఉండగా.. ఏడు ఏజెన్సీలకు ఆఫీసర్లు లారీల రవాణా బాధ్యత అప్పగించారు. ఒక్కో ఏజెన్సీ 50 లారీలను సమకూర్చాల్సి ఉంది. కానీ ఏ ఏజెన్సీ ఇప్పటి వరకు 50 లారీలను ఏర్పాటు చేయలేదు. మంత్రి ఆదేశాలు మేరకు కలెక్టరేట్‌కు లారీలను తీసుకొచ్చి చూపించాలి. కానీ తమ లారీలు ప్రస్తుతం కొనుగోలు సెంటర్లు, మిల్లుల వద్ద ఉన్నాయని.. వాటన్నిటిని కలెక్టరేట్ వద్దకు తీసుకొచ్చి ప్రదర్శించడం వీలు కాదని చెప్పారు. ఆయా సెంటర్లు, మిల్లుల వద్ద ఉన్న నాలుగైదు లారీలను జూమ్ ద్వారా చూయించి సైలెన్స్ అయిపోయారు. దీంతో ఏజెన్సీలు తీరుపై మంత్రితో పాటు ఆఫీసర్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సేకరించిన వడ్లను ఎక్కడ నిల్వ చేయాలే?
పెద్ద మొత్తంలో వడ్ల దిగుబడులు రావడంతో.. వాటిని రైతుల నుంచి సేకరించాక ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై కూడా ఆఫీసర్లు తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాలో 178 రైస్‌మిల్లులు ఉండగా.. 2014 నుంచి 2023 వరకు వివిధ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ కేటాయింపులు చేశారు. కొందరు మిల్లర్లు వాటిని అమ్ముకున్నారు. దాదాపు రూ.700 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో ఆఫీసర్లు గతేడాది వంద మిల్లులను బ్లాక్ లిస్టులో చేర్చారు.
ఆ మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులు చేయలేదు. మిగిలిన 78 మిల్లులకు ఈ యాసంగిలో సీఎంఆర్ కేటాయించాలని నిర్ణయించగా.. వాటిలో కొందరు మిల్లర్లు ఇంకా బ్యాంక్ ష్యూరిటీలను ఇవ్వలేదు. దీంతో సెంటర్లకు వస్తున్న వడ్లను కాంటా చేసిన మిల్లులకు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో జిల్లా నుంచి 42 వేల మెట్రిక్ టన్నుల వడ్లను మహబూబ్‌నగర్ జిల్లాకు ఆఫీసర్లు తరలించారు.
ప్రతి గింజను కొంటాం
యాసంగి సీజన్‌కు సంబంధించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల ద్వారా కొంటాం. వడ్ల రవాణాకు సంబంధించి మిల్లులు, కొనుగోలు సెంటర్ల వద్ద లారీల లోడింగ్, అన్ లోడింగ్ ప్రాసెస్‌ను స్పీడప్ చేయిస్తాం. ఇంకా కొందరు బ్యాంకర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేదు. వారి నుంచి బ్యాంకు గ్యారంటీలను తీసుకొని.. వడ్లను అలాట్ చేస్తాం.
వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్, వనపర్తి