వనపర్తి, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. బుధవారం వనపర్తి మార్కెట్ యార్డు, పెద్దమందడి మండలం వెల్టూరులో వడ్ల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంట తెచ్చిన రోజు రిజిస్టర్లలో పూర్తి వివరాలు నమోదు చేసుకుని, సీరియల్ నంబర్ల వారీగా కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతగా 396 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, రామకృష్ణారెడ్డి, స్వరూప పాల్గొన్నారు.
