వింటర్​లో హాట్​ టీతోపాటు హెల్దీ టీ తాగాలనుకుంటున్నారా..?

వింటర్​లో హాట్​ టీతోపాటు హెల్దీ టీ తాగాలనుకుంటున్నారా..?

మంచు కురిసే రోజులు మొదలైపోయాయి. తెల్లవారగానే కనిపించే మంచు పొగలతో వేడి వేడి టీ పొగలు పోటీ పడే రోజులు వచ్చేశాయి. రోజుకి వన్​ టైం టీ తాగేవాళ్లు కాస్తా.. వింటర్​లో వన్​ మోర్​ టైం అంటూ టీలు తాగేస్తారు. అయితే, ఈ వింటర్​లో హాట్​ టీతోపాటు హెల్దీ టీ తాగాలనుకుంటున్నారా.. మరింకేం! ఇక్కడ ముచ్చటగా మూడు టీలు ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన టీ చేసుకుని, ఎంజాయ్ ద సిప్!

పసుపు – అల్లం 

కావాల్సినవి : 

పచ్చి పసుపు తురుము లేదా పసుపు పొడి – అర టీస్పూన్ 
అల్లం తురుము – అర టీస్పూన్
మిరియాల పొడి – పావు టీస్పూన్
కొబ్బరి నూనె లేదా నెయ్యి – పావు టీస్పూన్
నీళ్లు – సరిపడా 

తయారీ :

ఒక గిన్నెలో నీళ్లు పోసి, అందులో పచ్చి పసుపు తురుము లేదా పసుపు పొడి, అల్లం తురుము, మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులోనే  కొబ్బరి నూనె లేదా నెయ్యి వేసి కలిపి, మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత తాగాలి. కావాలంటే ఇందులో తేనె కలుపుకోవచ్చు. దగ్గు, జలుబు, అలర్జీలు ఉన్నవాళ్లు ఈ టీని రాత్రి పడుకునే ముందు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఆర్థరైటిస్ నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. ఇమ్యూనిటీ  పెరుగుతుంది.          


దాల్చిన చెక్క - అనాస పువ్వు 

కావాల్సినవి :

గ్రీన్​ లేదా బ్లాక్ టీ – ఒక బ్యాగ్​​ లేదా ఒక టీస్పూన్, అనాస పువ్వు– రెండు, దాల్చిన చెక్క – ఒకటి, నీళ్లు – సరిపడా, తేనె – ఒక టీస్పూన్

తయారీ :

ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో అనాస, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. తరువాత అందులో టీ బ్యాగ్స్ లేదా ఒక టీస్పూన్​ టీ పొడి వేయాలి. మూత పెట్టి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాసులో తేనె వేసి, వేడి నీళ్లని పోసి కలిపితే పర్ఫెక్ట్​గా ఒక కప్పు టీ తాగడానికి రెడీ. ఈ టీ ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ ఇస్తుంది. అంతేకాకుండా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్, మలబద్ధకం, వికారం, వాంతులు, డయేరియా, గ్యాస్టిక్​ సమస్యలకు చెక్​ పెడుతుంది. అంతేకాదు.. వెయిట్​ లాస్​కి ఇది బెస్ట్​ టీ.

మసాలా 

కావాల్సినవి :

మిరియాల పొడి – అర టీస్పూన్, అల్లం తురుము – ఒక టీస్పూన్, నిమ్మ గడ్డి (లెమన్ గ్రాస్) – కొంచెం, దాల్చిన చెక్క పొడి – అర టీస్పూన్, తులసి ఆకులు – నాలుగు, గ్రీన్ టీ – ఒక బ్యాగ్
తేనె – ఒక టీస్పూన్  
నిమ్మకాయ చెక్క– ఒకటి
నీళ్లు – సరిపడా

తయారీ :

ఒక గిన్నెలో నీళ్లు పోసి, అందులో మిరియాల పొడి, అల్లం తురుము, నిమ్మ గడ్డి (లెమన్ గ్రాస్), తులసి ఆకులు వేసి ఐదు నిమిషాలు కాగబెట్టాలి. తరువాత అందులో  దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఒక కప్పులో ఆ నీటిని వడకట్టాలి.  తర్వాత ఆ నీళ్లలో గ్రీన్​ టీ బ్యాగ్ వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. మూత తీశాక, తేనె, నిమ్మకాయ చెక్క వేస్తే సరి. సువాసనలతో ఈ టీ తాగడానికి రెడీ. ఇది కూడా ఇమ్యూనిటీ పెంచుతుంది. జీర్ణసంబంధిత సమస్యల​ పని పడుతుంది. బరువు తగ్గేందుకు బెస్ట్ హోమ్ రెమెడీ.. ఈ టీ.