వారసులపై నేతల బెంగ.. అసెంబ్లీ బరిలో దింపే ఆలోచన

వారసులపై నేతల బెంగ.. అసెంబ్లీ బరిలో దింపే ఆలోచన
  • టికెట్​ రాకున్నా రాజకీయ అరంగేట్రం చేయించాలనే తపన
  • యూత్​ ఓట్లపై నేతల నజర్​

వనపర్తి, వెలుగు: దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్నట్లుగా తాము ఉండగానే, వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి అవకాశం ఉంటే ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపేందుకు పలువురు నేతలు తహతహలాడుతున్నారు. వయసు మీద పడి కొందరు రాజకీయాల్లో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని తమ వెంట పెట్టుకొని తిరుగుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీనియర్ల వారసులంతా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపేందుకు..

వనపర్తి రాజకీయాల్లో 40 ఏండ్లుగా కాంగ్రెస్  పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి చిన్నారెడ్డి తన కొడుకు ఆదిత్యారెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చారు. తాజాగా పార్టీలో రాష్ట్ర పదవిని ఇప్పించారు. కలిసి వస్తే ఈసారే బరిలోకి  దింపేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. మరోపక్క మంత్రి నిరంజన్ రెడ్డి తన అల్లుడు ప్రమోద్ రెడ్డికి నియోజక వర్గ ఇన్​చార్జి బాధ్యతలను అప్పగించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ చేశారు. అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన కూతురు స్నిగ్దారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. గద్వాల లేదంటే మరోచోట ఆమెను బరిలోకి దించి అదృష్టం పరీక్షించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. 

కొల్లాపూర్ లో కీలక నేత అయిన జూపల్లి కృష్ణారావు తన కొడుకు అరుణ్ ను ప్రత్యక్ష రాజకీయాల్లో దింపి క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఈసారి తన కొడుకుకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్  హైకమాండ్​ను కోరారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి పోటీగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. తనకు రాజకీయాలు కలిసి రాలేదని, ప్రతిసారి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యానని పేర్కొంటున్నారు. కొడుకును ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చి తన ఆశయాన్ని నెరవేర్చుకుంటానని ఎమ్మెల్సీ చెబుతున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన నాగం జనార్దన్ రెడ్డి వయో భారంతో ఇబ్బందులు పడుతున్నారు. 

ఆయన ఇప్పటికే తన కొడుకు నాగం శశిధర్ రెడ్డిని అసెంబ్లీ బరిలో దింపగా, గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరోసారి నాగం శశిధర్ రెడ్డి పోటీకి సిద్దమవుతున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు భరత్ కు అచ్చంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నేరుగా సీఎం వద్దే మొర పెట్టుకున్నారు. ప్రస్తుతం కల్వకుర్తి జడ్పీటీసీగా కొనసాగుతున్న ఆయన ఈసారి అవకాశం రాకుంటే పార్టీతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది. నేరుగా కేటీఆర్​ రంగంలోకి దిగి భరత్ కు సర్ది చెప్పడంతో దూకుడు తగ్గించారు. ఇక మాజీ ఎంపీ జగన్నాథం తన కుమారుడు మంద శ్రీనాథ్ కు బీఆర్ఎస్  నుంచి అవకాశం కల్పించాలని కోరినప్పటికీ హైకమాండ్​ పట్టించుకోలేదు. దీంతో తన కొడుకుకు రాజకీయ భవిష్యత్తు కల్పించేందుకు మాజీ ఎంపీ పావుల కదుపుతున్నారు. 

వారసుల రాకతో..

ఉమ్మడి జిల్లాలో పలువురు నేతలు తమ వారసులను జనంలోకి తీసుకొని రావడం ఆసక్తిగా మారింది. 60 ఏండ్లు పైబడిన నేతలు కావడంతో కార్యకర్తలతో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతోంది. దీంతో నష్టం జరుగుతుందని భావించిన పలువురు నాయకులు వారసులతో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పటి క్యాడర్  అవసరాలను గుర్తించాలంటే, తమ కుటుంబంలోని ఒక యువనేతను తమ వెంట ఉంచుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. రాజకీయాల పట్ల అవగాహన కలగడంతో పాటు క్యాడర్ లోని అసంతృప్తిని గుర్తించి వారు బయటకు పోకుండా చూసుకుంటున్నారు.

యువత ఓట్లే కీలకం..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో యువత ఓట్లు 50 శాతానికి చేరాయి. గత ఐదేండ్లలో ఓటు హక్కు పొంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓటు వేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 5 లక్షలకు పైగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 వేల కొత్త ఓటర్లు కీలకం కానున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహంతో వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే యువత కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించడం, వారు యువ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు చేస్తున్నా ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.